Heavy Rains in Manyam District Due to Low Pressure : అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు పట్టణ రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతో పాటు వీధిల్లోని రోడ్లు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై నడుములోతు వరకూ వరద నీరు పారింది. దీంతో నగర ప్రజలు, వాహనదారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లయి. మరి కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తప్పిన పెను ప్రమాదం : జిల్లాలోని సాలూరు మండలం దండిగాం వద్ద పెను ప్రమాదం తప్పింది. సువర్ణముఖి నది వంతెనపై వెళ్తున్న ట్రాక్టర్ వరద ఉధృతికి ఒక్కసారిగా బోల్తా పడింది. వంతెనపై భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నప్పటికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి అలాగే ముందుకు వెళ్లాడు. అక్కడి వారు ఎంత వద్దని వారించిన బ్రిడ్జ్‌పై వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు స్పందించి బాధితులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌పై రేషన్ డీలర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దొర్ల తాడివలస, మూల తాడివలస ప్రాంతాల్లో బియ్యం పంపీణీ చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - పలు జిల్లాల్లో భారీ వర్షాలు - IMD Issues Rainfall Alert to Ap
రహదారులన్నీ జలమయం : భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని పండా వీధి సమీపంలో భారీ చెట్టుకొమ్మ విరిగిపడటంతో అటువైపు వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి సీతానగరం మండలంలో గడ్డ పొంగడంతో అప్పయ్యపేట, పార్యతీపురం బొబ్బిలి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర హుటాహుటిన అప్పయ్యపేట చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గడ్డ ఉప్పొంగితే ఎదురయ్యే ఇబ్బందులను గ్రామస్థులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.