Heavy Rains are Falling in Prakasam District : అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ నది ఉద్ఢృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెమలిగుండ్ల రంగస్వామి దేవాలయానికి వెళ్లిన 25 మంది భక్తులు నది ప్రవాహం కారణంగా తిరిగి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం దాటాక ఎట్టకేలకు గుండ్లకమ్మ నదిని దాటించి భక్తులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు : కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతున్న ప్రకాశం జిల్లాలో మాత్రం వేసవి తాపం మొన్నటి వరకు తగ్గలేదు. వేసవిని తలపిస్తూ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలు వేసవి తాపాన్ని నుండి ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలకు జీవం పోస్తున్నాయి. వర్షాకాలం వచ్చిన జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం ఈ వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు జిల్లాలో సగటున 25.1 శాతం వర్షపాతం నమోదయ్యింది.
తీవ్ర అవస్థలు పడ్డ వ్యాపారులు : అల్పపీడనం ప్రభావంతో ఒంగోలులో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షనానికి రోడ్లపైకి నీరు రావడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని కర్నూలు రోడ్డు, సాయిబాబా గుడి ప్రాంతంలో మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ముందస్తుగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో తోపుడుబండ్ల వ్యాపారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు చాలా రోజుల తర్వాత వర్షాలు రావటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
వర్షంలో సైతం ఆగని ఫించన్ల పంపిణీ : జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వర్షంలో సైతం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రక్రియలో సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు. 20, 21 వార్డులలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి అధికారులతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
గుంటూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు - ముగ్గురు దుర్మరణం - CAR WASHED OUT THREE PEOPLE DIED