Heavy Rains and Floods in Alluri District: అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో వర్ష బీభత్సానికి గూడెం కొత్తవీధి మండలం అతలాకుతలమైంది. పిల్లిగడ్డ, మాదిగమల్లు, లంకపాకలు, చామగడ్డ వంతెనలు కొట్టుకుపోయాయి. 20 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడటంతో దారకొండ, గుమ్మరేవుల, దుప్పిలవాడ, సీలేరు, తడికొండ అమ్మవారి దారకొండ, గాలికొండ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోలాపుట్, బుంగాపుట్, లక్ష్మీపురం, బరడ పంచాయతీల్లో వంతెనలు దెబ్బతిన్నాయి.
జోలాపుట్ జలాశయం నుంచి 50వేల క్యూసెక్కులు నీరు విడుదల చేయడంతో వంతెన కొట్టుకుపోయింది. విషయం తెలిసుకున్న అరకు టీడీపీ ఇన్‌ఛార్జ్ దొన్ను దొర కోతకు గురైన ప్రాంతాన్ని గ్రావెల్ మట్టితో కప్పించి పాదచారులు వెళ్లేలా మార్గం సుగమం చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట: జిల్లా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జీకే మండలం, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచింగిపుట్టు, పాడేరు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట కొట్టుకుపోవడంతో గిరిజనులకు నష్టం వాటిల్లింది. చట్రాయిపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కాఫీ తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చింతపల్లి నుంచి జీకే వీధి, దారకొండ, సీలేరు వెళ్లే మార్గంలో 45 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాల్లో అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టినా పూర్తిస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన: గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం చంద్రబాబుకి పరిస్థితుల్ని వివరించి రోడ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఆదేశాలతో ఐటీడీఏ పీవో నేరుగా వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బాధితులకు నిత్యవసరకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ భూమిలో గ'లీజు' దందా- భారీగా పెనాల్టీ - YSRCP Leader Quarry Seized
రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్ - కేసు లేకుండానే యువకుడిపై దాడి - Guntur Police Violated Rules