Rain in Hyderabad : హైదరాబాద్‌ను భారీవర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం తరువాత భారీవర్షంగా మారింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తడిసిముద్దయ్యారు.
జీహెచ్ఎంసి పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్ పల్లి పరిధిలో మొదట వాన మొదలైంది. అక్కడి నుంచి గచ్చిబౌలి, పటాన్ చెరు, నిజాంపేట్, బాచుపల్లి, ముసాపేట్, చందానగర్ ,కూకట్ పల్లి, మూసాపేట, జూబ్లీహిల్స్, మియాపూర్ సర్కిళ్లకు విస్తరించింది. అటు తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లోనూ కూడా వర్షం కురిసింది. అంబర్ పేట, నల్లకుంట, నాచారం పరిధిలోనూ వాన ముంచెత్తింది.
Heavy Rain At LB NAGAR : దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పాతబస్తీలోని చార్మినార్, బార్కాస్, బహదూర్‌పురా ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. భారీగా వీచిన ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో చాలా సర్కిళ్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో సికింద్రాబాద్, బోడుప్పల్, పీర్జాదిగూడ, రాయదుర్గం, షేక్‌పేట, ఖాజాగూడ, సుచిత్ర ఏరియాల్లో సరఫరా నిలిచిపోయింది. చాలాచోట్ల విద్యుత్ సిబ్బంది ముందుగానే కరెంట్ సరఫరా ఆపేశారు.
అత్యధితంగా శేరిలింగంపల్లిలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా సికింద్రాబాద్‌లో 8.45 సెంటీ మీటర్ల వర్షం పడింది. కూకట్ పల్లిలో 70.8 సెంటీమీటర్ల వాన కురిసింది. వేసవికాలంలో ఇదే రికార్డ్ స్థాయి వర్షపాతం. భారీవర్షంతో పంజాగుట్టలోని ప్రజాభవన్ ముందు కూడా భారీగా వర్షపు నీరు చేరింది. గ్రేటర్ సిబ్బంది ఈ నీటిని మోటార్లతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూసుఫ్ గూడా శ్రీకృష్ణ నగర్లో వరద నీటిలో కొట్టుకు పోతున్న ద్విచక్ర వాహనాన్ని యువకుడు కష్టం మీద కాపాడుకున్నాడు.
వర్షంతో రోడ్లపై వాహనదారులు అవస్థలు పడ్డారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈదురుగాలుల వల్ల ముందున్నది కనిపించక వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు గంటకు పైగా వర్షం కురుస్తుండడంతో రహదారులు జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దాదాపు అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా రాయదుర్గం, హైటెక్ సిటీ, విప్రో జంక్షన్, పంజాగుట్ట, కోఠి ఏరియాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
నగరంలో ఈదురుగాలులతో వర్షం పడుతుండటంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం పడిన సమయంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 50 ఫిర్యాదులు వచ్చాయి. 74 ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. వర్షం వల్ల ఏర్పడిన ఇబ్బందుల గురించి 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని వారు సూచించారు.
Heavy Rains in Hyderabad Today : భాగ్యనగరం జలదిగ్బంధం.. ఎటుచూసినా వరదే.. అడుగు పెడితే బురదే
Heavy Rains in Hyderabad : భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం