Heavy Loss in Khammam due to Floods : భారీ వర్షాలు, వరదలు ఖమ్మం జిల్లాలో అన్నదాతకు అపార నష్టం మిగిల్చాయి. వివిధ దశల్లో ఉన్న పంటలు వరదల ధాటికి నష్టపోయాయి. ప్రధానంగా పత్తి, వరి, పెసర, మొక్కజొన్న, మిర్చితో పాటు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా యంత్రాంగం అంచనా ప్రకారం జిల్లాలో మొత్తం 5 లక్షల 14 వేల 395 ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వగా, వీటిలో 79 వేల 914 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. 54 వేల 45 మంది రైతులు వివిధ పంటలు నష్టపోయారు. వ్యవసాయ శాఖకు సుమారు రూ.112 కోట్ల నష్టం వాటిల్లింది. 53 వేల 648 పశువులు మృత్యువాతపడ్డాయి. దీంతో రూ.కోటి 16 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
విద్యుత్ శాఖకు రూ.14.5 కోట్ల నష్టం : మత్య్సశాఖకు రూ.4 కోట్ల 29 లక్షల మేర నష్టం వాటిల్లింది. 3 వేల 500 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. జిల్లాలో నీటి పారుదల శాఖకు సుమారు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 103 పనులకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 45 చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో కట్టలు కొట్టుకుపోయాయి. వివిధ నిర్మాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తం 5 చోట్ల ఎన్ఎస్పీ ప్రధాన కాల్వలకు గండ్లు పడ్డాయి. అనేక లిఫ్ట్‌లు మునిగిపోయాయి. మొత్తం 66 ప్రభుత్వ పాఠశాలల్లో సామగ్రి పూర్తిగా తడిసి పాడైపోయింది.
కంప్యూటర్లు, ఇతర ఫర్నీచర్ పూర్తిగా దెబ్బతిని రూ.కోటి 20 లక్షల మేర నష్టం వాటిల్లింది. వైద్య శాఖ పరిధిలో రూ.9 కోట్ల 23 లక్షల నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం నివేదికలో పేర్కొంది. విద్యుత్ శాఖకు రూ.14 కోట్ల 5 లక్షల మేర నష్టం జరిగింది. జిల్లాలో 4 వేల 500 విద్యుత్తు స్తంభాలు, 6 వందల ట్రాన్స్‌ఫార్మర్లు, 300 కిలోమీటర్ల మేర తీగలు తెగిపోయాయి. 56 గ్రామాల్లో 300 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. జిల్లాలో 76 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినగా రూ. 180 కోట్ల 37 లక్షల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం గుర్తించింది.
ఖమ్మం జిల్లాలో ఇంకా జలదిగ్బంధంలో ఇళ్లు, పంటపొలాలు - Flood Effect In Khammam