Allu Arjun Petition In high Court : అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన తరఫు లాయర్లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మళ్లీ విచారణ మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఆ కాసేపటికే ఆయన తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే చెప్పాలి అని కోర్టు అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది. అయితే తాము బుధవారం క్వాష్ పిటిషన్ వేశామని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లానట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
పరిశీలించిన న్యాయస్థానం పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే, పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అల్లు అర్జున్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. వాయిదా అనంతరం తిరిగి వాదనలు మొదలయ్యాయి.