Harish Rao Fires on Congress : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బాధ్యత పెరగాలి, హుందాతనం పెరగాలి కానీ ఆ కుర్చీని కించపరిచే విధంగా, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనే విధంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాడు ప్రచారంలో అబద్ధాలు చెప్పి, నేడు హామీలనడిగితే పాలనలో అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎలక్షన్ కోడ్‌లోపు ఆరు గ్యారంటీలను అమలుచేయాలి : హరీశ్‌రావు
BRS Latest News : బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, కానీ చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్లలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అబద్ధాలను కాంగ్రెస్(Congress) రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచి ఎనిమిది నెలలైనా 6 గ్యారంటీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలో 20 పైగా ఎంపీ స్థానాలను బీజీపీ గెలిచే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మార్పు వచ్చిందన్నారని మోటార్‌లు, ట్రాన్స్‌ఫార్మార్లు కాలుతున్నాయని వైరింగ్ దుకాణాలు, ఇన్వర్టర్ జనరేటర్ షాపులు అందుబాటులోకి వచ్చాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతామన్నారని, ఇప్పటికి రెండు నెలలైనా అమలు చేయలేదని మండిపడ్డారు.
రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుంది - హరీశ్‌రావు
రైతులకు రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆనాడు రైతులకు రైతుబంధు వేస్తే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టేనని మండిపడ్డారు. రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ దారులు ఉన్నారని వారికి డబుల్ పెన్షన్ రూ. 4000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. పెన్షన్ దారులకు మళ్లీ దరఖాస్తు ఎందుకని ప్రశ్నించారు.
మెదక్ కలెక్టరేట్‌ను ప్రారంభించడానికి కేసీఆర్ వచ్చినప్పుడు మెదక్ పట్టణానికి 50 కోట్లు, ఏడుపాయల అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులను కేటాయించారని, ఇప్పుడు ఆ నిధులన్నీ వాపస్ వెళ్లాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్యం చేశారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో చేస్తామన్న పనులు చేయలేదని రైతుబంధు ఇవ్వలేదని ఎండగడుతూ రీల్స్ చేసి యువత సోషల్ మీడియాలో పెట్టాలని యువకులకు సూచించారు.
"కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతామన్నారు. ఇప్పటికి రెండు నెలలైనా అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారా?. కాంగ్రెస్ పార్టీ నాడు ప్రచారంలో అబద్ధాలు చెప్పి, నేడు హామీలనడిగితే పాలనలో అసహనం వ్యక్తం చేస్తున్నారు". - హరీశ్‌రావు, మాజీమంత్రి
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ మైత్రి బట్టబయలైంది : హరీశ్‌రావు