Hanuman Jayanthi Celebrations in Telangana : హనుమాన్ జయంతి వేళ ఆలయాలు జై హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో బారులు తీరిన జనం, ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ భక్తులు, దీక్షాపరులు కాలినడకన ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఆలయాలకు కాలినడకన చేరుకుని ముడుపులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉత్సవాల సందర్భంగా వేకువజాము నుంచే స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షాపరులు ఆలయానికి చేరుకుని స్వామివారి సన్నిధిలో దీక్షా విరమణ చేశారు. అర్ధరాత్రి నుంచి భక్తుల తాకిడి నెలకొనగా, 50 వేల మందికి పైగా దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
స్వామివారి సేవలో పొన్నం : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వరాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు మహాభిషేకం, చందనలేపనం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని జోడు ఆంజనేయస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలకగా స్వామివారికి మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని అతి పురాతనమైన శ్రీకాశీబాగ్ ఆంజనేయస్వామి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, దూప, దీప నైవేద్యాలు సమర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జయంతి వేడుకల్లో వానరం : జహీరాబాద్‌లో హనుమాన్ జయంతి వేడుకల్లో వానరం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. దత్తగిరికాలనీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా సాధారణ భక్తుడిలా జనం మధ్య వచ్చి కూర్చుండిపోవటంతో అక్కడి వారంతా ఆసక్తిగా చూశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయంలో చందనోత్సవం, హనుమాన్ చాలీసా పారాయణం, శోభయాత్ర నిర్వహించారు.
ఖమ్మం జిల్లా వైరా అభయ ఆంజనేయస్వామి, హిమాంనగర్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలకు హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. తల్లాడ మండలం అంజనాపురం వద్ద హనుమంతుడి భారీ విగ్రహం ఎదుట భక్తులు భజనలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి హనుమాన్ ఆలయంలో 108 కళాశాలతో హనుమంతునికి అభిషేక కార్యక్రమం కన్నుల పండగ జరిగింది.
హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వరాలయం వద్ద శివాజీనగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన ప్రసాదం పంపిణీ చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని, సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
సువర్చల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి యజ్ఞ హోమాది అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
ఆ ఊళ్లో వీధికో హనుమాన్ ఆలయం - ఇంతకీ ఎందుకలా? - 50 Hanuman Temples in Vellulla