Guntur Police Violated Rules : ఏపీలో కొందరు ఖాకీలు పోలీసు శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోతున్నారు. సివిల్ తగాదాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఆ శాఖలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు మితిమీరి జోక్యం చేసుకున్నారు.
'మీపై కేసు ఉంది పదండి స్టేషన్‌కని చెప్పి' బాధిత యువకుడిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించుకుని సుమారు గంటకుపైగా తిప్పి పలు రకాలుగా వేధించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన గుంటూరులో ఈ నెల 11న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఒంగోలుకు చెందిన ఇర్ఫాన్ అనే ఛార్టెడ్ అకౌంటెంట్ నల్లపాడు స్టేషన్ పరిధిలోని ఓ యువతిని ప్రేమించాడు. పెద్దల సమక్షంలో గత మే నెలలో వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఇంటికొస్తే వివాదాన్ని పరిష్కరించుకుందామని ఇర్ఫాన్‌ను ఆ యువతి పిలవగా అతను ఈ నెల 11న వెళ్లాడు. అప్పటికే ఆ ఇంట్లో సివిల్ దుస్తుల్లో పోలీసులు ఉన్నారు. ఆ యువకుడు రాగానే ఆ అమ్మాయి విడాకులిస్తానని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.
AP Police Involved Illegal Activities : అనంతరం ఇద్దరు పోలీసు సిబ్బంది ఇర్ఫాన్‌ని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకున్నారు. పోలీసు కుటుంబానికి చెందిన అమ్మాయినే ఇబ్బంది పెడతావా? అంటూ అతడిని ప్రశ్నిస్తూ మరోవైపు కొడుతూ గుంటూరు అంతటా తిప్పారు. పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్లడం లేదని బాధితుడు ప్రశ్నించినా వినలేదు. చివరకు బస్టాండ్ లోపలికి తీసుకెళ్లి వాహనాన్ని ఆపి వారు ఫోన్లో మాట్లాడుతుండగా ఇర్ఫాన్ తన బంధువులకు ఫోన్ చేసి రప్పించారు. అతనిపై ఏం కేసు పెట్టారు? నోటీసులేవీ అని బంధువులంతా నిలదీయగా పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు.
వెంటనే బంధువులతో కలిసి అదే రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని ఇర్ఫాన్ తెలిపారు. ఫిర్యాదు ఇచ్చి వచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 13న మరోసారి వెళ్లి ఎస్పీని కలిసి చెప్పామని వివరించారు. ఆయన ఆదేశాల మేరకు మహిళా స్టేషన్ అధికారులు ఆదివారం తనను పిలిచి స్టేట్‌మెంట్ తీసుకున్నారని వెల్లడించారు. దీని వెనుక ఓ సీఐ ఉన్నారని ఇర్ఫాన్ వాపోయారు.
ఇర్ఫాన్ భార్య ఫిర్యాదు మేరకే : తనను పెళ్లి చేసుకుని మహ్మద్ ఇర్ఫాన్ ఇబ్బంది పెడుతున్నారని ఆయన భార్య స్టేషన్లో ఫిర్యాదు చేసిందని మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పీవీ సుబ్బారావు తెలిపారు. ఈ నెల 11న తన ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నారని చెప్పడంతో ముందు జాగ్రత్తగా పోలీసులను పంపామని అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆ యువకుడిని పిలిచి ఏం జరిగిందో తెలుసుకున్నామని చెప్పారు. నివేదికను ఎస్పీకి అందజేస్తానని వివరించారు. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి ఏ స్టేషన్లో ఫిర్యాదు చేశారు? ఆమె ఇంటికెళ్లిన పోలీసులెవరని ప్రశ్నించగా తనకు ఆ వివరాలు తెలియవని డీఎస్పీ పేర్కొనడం గమనార్హం.
ఈ పోలీసులేంటీ ఇలా అయిపోయారు బ్రో! ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - AP Police Corruptions