Guntur People Suffering Due to Lack of Drinking Water: వేసవి కాలం వస్తుందంటే చాలు గుంటూరు ప్రజలు తాగునీటి కష్టాలు తలుచుకుని భయపడిపోతున్నారు. ఇప్పటికే శివారు ప్రాంత వాసులకు గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు అందని పరిస్థితి దాపురించింది. ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్, వికాస్ నగర్, పలకలూరు రోడ్, స్వర్ణభారతి నగర్, రెడ్డిపాలెం, గోరంట్ల, ప్రగతినగర్, పొన్నూరు రోడ్ తదితర శివారు ప్రాంతాలకు నీళ్లు రావటం లేదని స్థానికులు తరచూ నగరపాలక అధికారుల ముందు మొరపెట్టుకుంటున్నారు. అసలే అధిక ఉష్టోగ్రతల వల్ల ఈ వేసవిలో నీటి వినియోగం పెరుగుతుందని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటంలో అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన జంతు కళేబరం - తల్లిదండ్రుల ఆగ్రహం
సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు నింపుకుని అప్రమత్తంగా ఉండాల్సిన ఇంజినీరింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పర్యవసానంగా ఈ వేసవిలో గుంటూరు నగర ప్రజలకు నీటి సమస్య తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. నగరంలో 135 మిలియన్ లీటర్ల నీళ్లు సరఫరా చేసేందుకు వీలుగా తాగునీటి వనరులు ఉన్నా పంపిణీలో నెలకొన్న లోపాలతో ప్రస్తుతం 90 మిలియన్ లీటర్లు వస్తున్నాయి. 10 లక్షల జనాభా కలిగిన గుంటూరు నగరానికి ఐదు మాసాలకు సరిపడా నీళ్లు నిల్వ చేసుకోవటానికి తెనాలికి సమీపంలో సంగంజాగర్లమూడి వద్ద 100 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ చెరువు ఉంది. ప్రస్తుతం దానిలో 60 శాతం లోపే నీళ్లు ఉన్నాయి.
వేసవి రాకుండానే అడుగంటుతున్న కాలువలు - గ్రామాల్లో ఆగిపోయిన నీటి సరఫరా
తాగునీటి అవసరాలకు గత కొద్దిరోజులుగా పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని వదలగా అవి కొమ్మమూరు కెనాల్‌కు చేరాయి. ఆ నీటితో చెరువుని నింపుకునే అవకాశం ఉన్నా నగరపాలక ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చెరువులో పూర్తిసామర్ద్యం మేరకు నిల్వలు లేకుండాపోయాయి. మరోవైపు ఏ క్షణానైనా కొమ్మమూరు కెనాల్‌లో నీటి సరఫరా ఆగిపోయే ప్రమాదముంది. ఇంకోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈఏడాది సాగర్, పులిచింతల నుంచి ఇప్పట్లో తిరిగి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వదిలే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తాగునీటి గండం తప్పేలా లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలులో దాహం కేకలు- తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు
ప్రస్తుతం సంగంజాగర్లమూడి చెరువులో 48.5 అడుగుల పూర్తి స్థాయి సామర్థ్యానికి గానూ 41.5 అడుగులు మాత్రమే నీళ్లు ఉన్నాయి. వాటిలో 12నుంచి 14 అడుగులు ఎప్పుడూ చెరువులో ఉంటాయి. వాటిని పంపింగ్ చేయటానికి సాధ్యపడదు. నగరపాలక ఉన్నతాధికారులు, మేయర్ స్పందించి కాలువ ఆగిపోకుండానే నీళ్లు చెరువులోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొమ్మమూరు కెనాల్ నుంచి నీటిని వేగంగా చెరువులోకి మళ్లించి, ఫిల్టరేషన్ ప్లాంట్‌కు పంపేందుకు 150 హెచ్‌పీ సామర్థ్యమున్న మోటార్లు అవసరం.
ఈ మేరకు వాటిని కొనుగోలుచేసి స్టోరేజీ ట్యాంకులో అమర్చాలని రెండేళ్ల క్రితమే టెండర్లు పిలిచారు. ఆ తరువాత పనులను పూర్తిగా పక్కన పెట్టడంతో ఇప్పటికీ 75 హెచ్‌పీ మోటార్లనే నీటిని తోడటానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల సకాలంలో చెరువు నిండటం లేదు. మరోవైపు గుంటూరు సంగంజాగర్లమూడి ట్యాంకులోకి నీళ్లు పంపే మోటారు పంపులు కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. వాటిని పునరుద్దరించకపోవడం కూడా సమస్యగా మారింది.