GRMB Said Give DPRs of Unauthorized Projects : గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రెండు రాష్ట్రాలు ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు(డీపీఆర్) సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌లో బోర్డు ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ ఎన్కేసిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పలు అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది.
GRMB Meeting in Hyderabad : ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి అజ్‌గేషన్, తెలంగాణ ఈఎన్సీలు అనిల్‌కుమార్, శంకర్, సంయుక్త కార్యదర్శి భీం ప్రసాద్, సీఈలు శ్రీనివాస్, శంకర్ నాయక్, ఎస్‌ఈ కోటేశ్వరరావు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తరఫున జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి వెంకటాచార్యులు, సీఈ కుమార్, ఈఈ గిరిధర్, డీఈ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా చర్చించిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ ప్రాజెక్టులపై : తెలంగాణలోని శ్రీపాద ఎల్లంపల్లి, కుప్టిపై లిఫ్టులు, వరద కాలువ విస్తరణ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-2 విస్తరణ, కాళేశ్వరం అదనపు టీఎంసీల పనులకు అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ స్పందించి శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్టులు, వరద కాలువ విస్తరణ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-2 విస్తరణ పనులకు ఇప్పటికే అనుమతులు ఉన్నాయని, విస్తరణ పనులతో ఆయకట్టు పెరగలేదని వివరించింది. కుప్టీ డీపీఆర్‌ను త్వరలో సమర్పిస్తామని, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నాయని ఈ వివరాలను అందజేసినట్లు తెలిపింది.
పాలమూరు-రంగారెడ్డి NGT తీర్పుపై SLP వేయాలని నిర్ణయించాం: రజత్‌కుమార్
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై : ఆంధ్రప్రదేశ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం ఎత్తిపోతలు, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ,చింతలపూడి, వెంకటనాగారం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) కోరింది. మే నెల నాటికి సమర్పిస్తామని ఏపీ సమాధానం ఇచ్చింది.
Funds for GRMB : 'గోదావరి బోర్డుకు నిధులు ఇవ్వండి'
గోదావరి ట్రైబ్యునల్‌కు టీవోఆర్ అవసరం లేదన్న తెలంగాణ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2కు విధివిధానాలు(టీవోఆర్) ఖరారు చేసిన మాదిరి గోదావరి నదీ జలాల పంపిణీకి ట్రైబ్యునల్‌కు టీవోఆర్ జారీకి బోర్డు దోహదం చేయాలని ఏపీ కోరంది. దీంతో ఈ అంశం చర్చకు వచ్చింది. కృష్ణా ట్రైబ్యునల్ పరిధిలో విచారణలో ఉన్న అంశాన్ని బోర్డులో చర్చకు పెట్టడం ఆక్షేపణీయమని తెలంగాణ తెలిపింది.
నీటి లభ్యత అధ్యయనంపై :
- గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. దీనిపై బోర్డులో చర్చకు పెట్టడంతో తెలంగాణ ఆక్షేపణ వ్యక్తం చేసింది.
- పరీవాహకంలో టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు బోర్డు నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ వివరించింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో 19 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టామని తెలిపింది. డేటా నిర్వహణపై జీఆర్‌ఎంబీ సందేహం వ్యక్తం చేయగా సెంట్రల్ సర్వర్ నుంచి డేటా తీసుకునే వీలుంటుందని రెండు రాష్ట్రాలు బోర్డుకు స్పష్టం చేశాయి.
- రెండు రాష్ట్రాల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరానికి ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్రాలు జీఆర్‌ఎంబీకి సూచించాయి. బోర్డుకు రూ.16 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. సీఈ, ఎస్‌ఈ, ఈఈ ఇతర పోస్టులను పెంచుకునే అంశంపై బోర్డు విధుల్లో మార్పులు లేవని, ఉన్న సిబ్బందితో ముందుకు వెళ్లాలని రాష్ట్రాలు సూచనలు చేశాయి. 15 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలకు సంబంధించి జలసౌధలో అనుసరిస్తున్న నిబంధనలను అమలు చేయాలని తెలంగాణ పేర్కొంది.