Govt School Land Acquisition in YSR District : గుడిని గుడిలో లింగాన్నీ మింగేస్తారన్నది పాత సామెత! వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు పిల్లలు చదువుకునే బడిని, బడి స్థలాన్నీ కొట్టేశారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. దానిపై 8 లక్షలు బ్యాంకు రుణం కూడా తెచ్చుకున్నారు. ఈ పాపంలో రెవెన్యూ అధికారులూ భాగం పంచుకున్నారు.
పాఠశాలపై వైఎస్సార్సీపీ నేతల కన్ను : వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం గోవిందాయపల్లెలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన భూమిని వైఎస్సార్సీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. మున్నెల్లి పొలంలోని సర్వేనంబర్ 755లో 60 ఏళ్ల నుంచి ఈ పాఠశాల ఉంది. 120 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. తువ్వపల్లె, మున్నెల్లి, అయ్యవారిపల్లె, రెడ్డివారిపల్లె, అమ్మవారిపేట గ్రామాల నుంచి విద్యార్థులు ఈ బడికి వస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ బడి స్థలానికి పట్టా మంజూరు చేసుకుని ఆన్ లైన్ చేసేసుకున్నారు.
ప్రజల సొమ్ము సర్వే రాళ్లపాలు- రూ.525 కోట్లు మంచినీళ్లలా వెచ్చించిన ఏపీఎండీసీ - LAND RESURVEY stones
రెవెన్యూ అధికారుల హస్తం : వైఎస్సార్సీపీకి చెందిన కొండా వెంకట సుబ్బమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ స్థలంపై బి.కోడూరు బ్యాంకులో 8 లక్షల రూపాయల రుణం కూడా పొందారు. మొత్తం 4 ఎకరాల 27 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు. మీ భూమి వెబ్ సైట్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు కూడా గుడ్డిగా కళ్లు మూసుకుని విద్యార్థులు చదువుకునే పాఠశాలను వైఎస్సార్సీపీ నాయకులకు అప్పనంగా రాసివ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు.
ఎద్దులబీడు స్థలం ఆక్రమణ : మున్నెల్లి పంచాయతీలో ఇంకా అనేక ప్రభుత్వ భూములను వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేశారు. గోవిందాయపల్లెలో ఊరందరికీ కలిపి ఎద్దుల బీడు ఉంది. దీనిలో స్థానికులంతా పశువులను మేపుకుంటారు. అది ఊరు ఆస్తి. సమీప గ్రామాలకు చెందిన వారి పేర్లతో ఎద్దులబీడు స్థలాన్నీ ఆన్ లైన్ లో నమోదు చేయించుకున్నారు. నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డికి 2.69 సెంట్లు, 787 సర్వేనంబర్‌లో మహా లక్ష్మమ్మ పేరు మీద 4 ఎకరాల 12 సెంట్లు, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి పేరు మీద 4 ఎకరాల 12 సెంట్లు, గంటా రాజశేఖర్ పేరు మీద 55 సెంట్లు, ముచ్చర్ల కేశవయ్య పేరుమీద 54 సెంట్లు, ముచ్చర్ల వెంకటేశ్వర్లు పేరుమీద 55 సెంట్ల భూమిని ఆన్ లైన్ లో ఎక్కించుకున్నారు.
చిత్తూరు 'పెద్దారెడ్డి' లీల - అధికారుల అండతో 982 ఎకరాలు కాజేశారు - YSRCP land irregularities
గుడిసెల కోసం పరస్పరం రాళ్లదాడి : తాజాగా బద్వేలు సమీపంలోని గోపవరం వద్ద ప్రభుత్వ భూమిలో వేసుకున్న గుడిసెల కోసం ఇరుగ్రామాల ప్రజలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగక ముందే రెవెన్యూ యంత్రాంగం మేల్కొని, వైఎస్సార్సీపీ నాయకుల చెరబట్టిన భూములకు విముక్తి కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.