Govt Focus on GCCs Establishment in Hyderabad : గ్లోబర్ కేపబిలిటీ సెంటర్ ఇప్పుడీ పదం మన దేశ ఐటీ రంగంలో హాట్ టాపిక్. సంక్షిప్తంగా జీసీసీలుగా పిలుచుకునే వీటిని ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇతోధికంగా రాయితీలు ప్రకటిస్తున్నాయి.
భారత్‌లో 2010లో 700 జీసీసీలు ఉండగా వాటిలో 4 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పనిచేశారు. 2023 సంవత్సరం నాటికి మొత్తం 1600 జీసీసీలు ఏర్పాటుకాగా ఉద్యోగుల సంఖ్య 16.59 లక్షలకు చేరింది. ఇక 2028 సంవత్సరానికి వీటి సంఖ్య 2,100కి పెరగనుందని, అప్పటికవి 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. రానున్న రెండు సంవత్సరాలల్లో జీసీసీలు దేశంలోని ఆరు ఐటీ నగరాల్లో 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
జీతాలు ఇలా ఉన్నాయి : సంప్రదాయ ఐటీ ఉత్పత్తులు, సేవల సంస్థల్లో ఎంట్రీ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వార్షిక సగటు వేతనం రూ.5.7 లక్షలు. మూడేళ్ల అనుభవముంటే రూ.11.7 లక్షలు ఇస్తున్నారు. జీసీసీల్లో ఎంట్రీ లెవెల్‌లో ఏఐ, ఎంల్ ఇంజినీర్లకు రూ.8.20 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తోంది. మూడేళ్ల అనుభవముంటే రూ.21.8 లక్షలు జీతం ఉంటుంది.
జీసీసీలు అంటే ఏంటీ ఇంతకి : వివిధ దేశాలను చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతోపాటు, చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ)లు అంటారు. ఆయా సంస్థలు ఇటీవల వీటిని ఐటీ, ఆర్‌అండ్‌డీ, ఫైనాన్స్, టెలికాం, బ్యాంకింగ్, వినియోగదారుల మద్దతు వంటి బహుళ సేవలను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో న్యూ టెక్నాలజీ అభివృద్ధితోపాటు స్థానిక స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలతో పని చేసి కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు భారీస్థాయిలో ఏఐ, ఎంఎల్, జెన్ ఏఐ, బ్లాక్‌చైన్, ఐవోటీ, క్లౌడ్, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాద్ దూకుడు : నిపుణులైన మానవ వనరుల లభ్యత, దేశ జనాభాలో 20-34 ఏళ్లలోపు యువత 24% ఉండటం, పైగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగి ఉండటం, మొత్తం పట్టభద్రుల్లో 24% సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) పట్టభద్రులే ఉండటంతో తమ జీసీసీ ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు భారత్ దేశాన్నే ఎంచుకుంటున్నాయి. వీటిలో 57% బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంభందించినవి. మరో 29% టెక్నాలజీ, మీడియా, టెలికం రంగాలకు చెందినవి. ఇవి ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, దిల్లీల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణలో నాలుగేళ్లుగా హైదరాబాద్ నగరం దూకుడు ప్రదర్శిస్తోంది. దీంట్లో ఏకంగా బెంగళూరును దాటేసింది.
- భారత్‌లో ఉన్న జీసీసీల్లో 20 శాతానికిపైగా హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి.
- ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాల కారణంగా ఆయా సంస్థలు బెంగళూరు తర్వాత హైదరాబాద్‌వైపు మొగ్గు చూపుతున్నయి.
- 2023 అక్టోబరు నుంచి 2024 జనవరి వరకు మన దేశంలోకి కొత్తగా 14 జీసీసీలు రాగా వాటిలో ఎవర్‌నోర్త్, ఎల్లాయిడ్ బ్యాంకింగ్ గ్రూపు, వార్నర్ బ్రదర్స్ సంస్థలవి తెలంగాణలో కొలుదీరాయి.
- 29 జీసీసీలు విస్తరణ దిశగా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గోల్డ్‌మాన్ శాక్స్, ఫెడెక్స్, టీజేఎక్స్, స్టెల్లాంటిస్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బ్రిస్టల్ మైయర్ స్క్విబ్, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ జీసీసీలు విస్తరణలో ఉన్నాయి.
- ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ సైతం తమ జీసీసీని నగరంలోని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్‌లలో స్కిల్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ జీసీసీల్లో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్సల్టింగ్ రంగాల పెర్సంటేజ్ ఎక్కువ ఉంది.