Govt Enquiry on Land Grabbing in Andhra Pradesh: గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేసిన అక్రమార్కుల భరతం పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముందుగా ఫ్రీ హోల్డ్ భూముల వివరాలను సేకరించేందుకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆయన రావడానికి కంటే ముందుగానే జిల్లాలో రెవెన్యూ భూముల పరిస్థితిని అంచనా వేసేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వైఎస్సార్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మైదుకూరు నియోజకవర్గంలో భూముల వివరాలపై రెవెన్యూ యంత్రాంగం జల్లెడ పడుతోంది.
గత ఐదేళ్లూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు సాగించిన భూకబ్జాలపై ప్రభుత్వం జిల్లాల వారీగా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా స్వయంగా విజయనగరం, విశాఖ జిల్లాల్లో బాధితుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో 2 లక్షల 44 వేల ఎకరాల డీకేటీ భూములు ఫ్రీ హోల్డ్ చేశారని సిసోదియా గత నెలలో స్వయంగా ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయనే ఉద్దేశంతో సిసోదియాను జిల్లాల పర్యటనకు పంపారు. ఇప్పటికే ఆయన విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయన రావడానికి ముందే ముందే వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి, ఫ్రీ హోల్డ్ చేసిన డీకేటీ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు - ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ - Agri gold Land Issue
డీకేటీ భూములు తీసుకున్న లబ్ధిదారులు 20 ఏళ్ల వరకు అమ్మడానికి, కొనడానికి వీలులేకుండా నిషేధం ఉంది. కానీ వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు చాలా మండలాల్లో డీకేటీ భూముల కోసం ఐదేళ్లకే నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ఆధారాలు లభించాయి. వాటన్నింటికీ ఫ్రీహోల్డ్ కల్పించి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం విచ్చలవిడిగా భూములు అన్యాక్రాంతం అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
పైలట్ ప్రాజెక్టు కింద మైదుకూరు, వీరబల్లి మండలాలను ఎంపిక చేశారు. ఈ రెండు మండలాల్లో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయికి వెళ్లి జల్లెడ పడుతున్నారు. క్రయవిక్రయాలకు వీల్లేని అసైన్డ్, డీకేటీ భూములను వైఎస్సార్సీపీ నేతల ఒత్తిళ్లతో ఎక్కడెక్కడ ఫ్రీహోల్డ్ చేశారో ఆరా తీస్తున్నారు. మైదుకూరు మండలంలో 3100 ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో భూ కబ్జాల గుట్టు విప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం తర్వాత రెవెన్యూ అధికారులు అన్ని జిల్లాల్లోనూ అప్రమత్తమయ్యారు. భూ ఆక్రమణ లెక్కలు తీసి రికార్డులు పరిరక్షించాలని నిర్ణయించారు.
"గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో జరిగినంత భూ అక్రమాలు ఎక్కడా జరగలేదు. కలెక్టరేట్లో ఒక వ్యక్తిని పెట్టి, ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు వారికి చేయాలో అన్నది ఒక ప్లాన్ ప్రకారం కబ్జా చేశారు". - ఆంజనేయులు, ప్రజాసంఘం నాయకుడు, కడప