Govt Conduct Exams For CBSE Students Assessment Ability: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 12 నుంచి 14 వరకు, మళ్లీ 17న ట్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు మినహా మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టనున్నారు. ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు సోమవారం నుంచి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పది యాజమాన్యాల్లో వెయ్యి బడులకు గతంలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకున్నారు. వీటిల్లో చదువుతున్న 82,764 మంది విద్యార్థులు 2025లో సీబీఎస్‌ఈ పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. గతంలో వీరు ఆరో తరగతిలో ఉన్న సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకు తెలుగులో చదివిన వీరు ఒక్కసారిగా ఆంగ్లంలోకి మారాల్సి వచ్చింది. ఉపాధ్యాయులను కూడా సన్నద్ధం చేయకుండానే హడావుడిగా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చారు. వీరు ఒక్కో సంవత్సరానికి చదువుతూ ఇప్పుడు పదో తరగతికి వచ్చారు.
ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్- సెమిస్టర్స్ కాదు! - CBSE Board Exam Rules
ఈలోపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెయ్యి బడుల్లో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. ఇప్పుడు వీరు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ద్విభాష పాఠ్య పుస్తకాలు ఇవ్వడంతో ఉపాధ్యాయులు సైతం తెలుగు, ఆంగ్లాన్ని మిళితం చేసి పాఠాలు చెప్పారు. కింది తరగతుల్లో చాలా మంది పిల్లలు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసినా మార్కులు ఇచ్చారు. ద్విభాష పుస్తకాలు ఉన్నందున ఎక్కువగా తెలుగులోనే బోధన, అభ్యసన, పరీక్షల నిర్వహణ కొనసాగింది. ఇప్పుడు సీబీఎస్‌ఈ పరీక్షలు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? వీరు సీబీఎస్‌ఈ పబ్లిక్ పరీక్షలను ఎదుర్కోగలరానే అంచనా వేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది.
విద్యార్థులు ట్యాబ్‌లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రాలను ట్యాబ్లో అప్లోడ్ చేస్తారు. ఈనెల 12 నుంచి 14 వరకు, ఆ తరువాత 17న ఈ పరీక్షలు ఉంటాయి. ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు. సీబీఎస్ఈలో ఐదు సబ్జెక్టుల విధానం ఉన్నందున తెలుగును మినహాయించి మిగతా వాటిని నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 50 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి ఒక్కో మార్కు ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన సిలబస్‌పై ఈ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులను సీబీఎస్‌ఈ పరీక్షలకు అనుమతించడమా? లేదంటే రాష్ట్ర బోర్డు పరీక్షలు నిర్వహించడమా? అనే దానిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుంది.