Formula E Race Case Update : ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ జరపాలని ఏసీబీకి పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ గత వారమే లేఖ రాసింది. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి వచ్చింది. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటే వారి స్థాయి ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్‌కు అనుమతి కోసం లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై గవర్నర్ సైతం న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌పై కేసు నమోదుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అంగీకారం తెలపడంతో అప్పటి చీఫ్ ఇంజినీర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఏసీబీకి సీఎస్ లేఖ రాసినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే? : ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలక శాఖల మధ్య 2022లో ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఇది ఎల్ఎఫ్ఏ (లాంగ్-ఫాం అగ్రిమెంట్) జరిగింది. 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్ నిర్వహించేలా ఈ ఒప్పందం కుదిరింది. తొమ్మిదో సీజన్ కార్ రేస్ 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో జరిగింది.
అప్పటి పురపాలక శాఖ మంత్రి ఆమోదంతో ఈ ఒప్పందం కుదిరిందని, శాఖాధిపతిగా తానే ఎంవోయూ చేశానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన సమాధానంలో అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సీజన్లో పెట్టుబడి పెడతానని చెప్పిన ప్రమోటర్, తొలి సీజన్లో నష్టం వచ్చిందంటూ లేఖలు రాసినట్లు పురపాలక శాఖ ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే పదో సీజన్‌కు వచ్చేసరికి ప్రమోటర్‌గా ఉండేందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ ముందుకు రాలేదు. అలాగని ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. హైదరాబాద్‌లో రేస్ నిర్వహించేందుకు ఎఫ్ఈవో ఆసక్తి చూపిందని, కానీ తగిన సమయం లేకపోవడం వల్లే ప్రత్యామ్నాయ ప్రమోటర్‌ని ఖరారు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. కావున పదో సీజన్ నిర్వహణపై ముందుకు వెళ్లాలని పురపాలక మంత్రి సూచించారు.
నిధుల చెల్లింపునకు సంబంధించి సెప్టెంబరు 25న ఎఫ్ఈవో నుంచి వచ్చిన మెయిల్ ఆధారంగా 2023 సెప్టెంబరు 27న మంత్రికి ఫైల్‌ను సర్క్యులేట్ చేసి హెచ్ఎండీఏను ప్రమోటర్‌గా, హోస్ట్ సిటీగా చేర్చామని తెలిపారు. ఆతర్వాత ప్రమోటర్‌తో ఎఫ్ఈవో ఒప్పందాన్ని రద్దు చేసుకుందని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. దీంతో ఈ త్రైపాక్షిక ఒప్పందం కాస్త ఎఫ్ఈవో, హెచ్ఎండీఏల ద్వైపాక్షిక ఒప్పందంగా మారిందని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి.
హెచ్ఎండీఏ.. ఎఫ్ఈవోకు అక్టోబరు 5న రూ.23 కోట్లు, అదే నెల 11న మరో రూ.23 కోట్లు కలిపి మొత్తం రూ.46 కోట్లను చెల్లించింది. పన్నుల కింద మరో రూ.9 కోట్లు కూడా చెల్లించింది. రేస్‌లో హెచ్ఎండీఏ ప్రమోటర్‌గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఎఫ్ఈవో, హెచ్ఎండీఏకు మధ్య 2023 అక్టోబరు 30న కుదిరింది.
ఈ ఒప్పందానికి ముందే హెచ్ఎండీఏ డబ్బులను ఎఫ్ఈవోకు చెల్లించింది. అక్టోబరు 11న రెండో దఫాగా రూ.23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు హెచ్ఎండీఏ చెల్లించిన రూ.43 కోట్లను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈవోకు చెల్లించిందని.. ఇలా చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి అవసరమని తెలిపింది. ఈ అనుమతి తీసుకోకపోవడం ఉల్లంఘనల కిందకు వస్తుందని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పురపాలక శాఖ చెప్పింది.
ఆయన చెప్పారనే ఈ ఫార్ములా రేస్ ఒప్పందం - ఐఏఎస్ అర్వింద్ కుమార్ నివేదిక
హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దు - కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్