Headmaster Suicide in Anantapur : ఆయన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు. ప్రశాంతగా సాగిపోతున్న వారి జీవితంలోకి స్నేహితుల రూపంలో ముప్పు ముచ్చుకొచ్చింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆయణ్ని వారు నమ్మించారు. సరేనని అప్పు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టారు. కొద్ది రోజులు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత మిత్రులు ముఖం చాటేశారు. ఇటు రుణదాతల ఒత్తిడి, అటు ఫ్రెండ్స్ మోసం చేయడంతో మనోవ్యథకు లోనై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగింది.
ఇందుకు సంబంధించి కూడేరు సీఐ రాజు తెలిపిన వివరాలు మేరకు అనంతపురం బళ్లారి రోడ్డులో ప్రశాంతి కుటీర్‌లో నివాసం ఉండే భాస్కర్‌బాబు (53), ఆయన భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆయన ప్రస్తుతం మల్లికేతిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పట్టణంలో ఉంటున్న కంబదూరుకు చెందిన తన స్నేహితుడు గాజుల శ్రీనివాసులు, అతని మిత్రుడు బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేశ్‌కుమార్‌రెడ్డి అనంతపురంలో షేర్ మార్కెట్, ఆన్‌లైన్ బిజినెస్ నిర్వహిస్తున్నారు.
వీటిలో మంచి లాభాలు వస్తాయని భాస్కర్‌బాబుని వారు నమ్మించారు. ఆయన వారి మాటలు నమ్మి యాప్‌లు, బ్యాంకులు, బయటి వ్యక్తులతో రుణం తీసుకుని రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీనికివారు ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకం ఇచ్చారు. కొన్నాళ్లు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇస్తూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అతని పెట్టుబడికి సంబంధించి ఎలాంటి లాభం, అసలు ఇవ్వకుండా మొండికేశారు. దీంతో అప్పుల భారం పెరిగిపోవడంతో యాప్‌లు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారింది.
Kudair Headmaster Suicide Case : దీంతోపాటు అప్పు చెల్లించాలని భాస్కర్బాబుకి బయటి వ్యక్తుల నుంచి ఒత్తిడి అధికమైంది. భరించలేక ఆయన ఆదివారం కూడేరు మండలం కమ్మూరు సమీపంలో ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్‌కు చేరుకుని సూసైడ్ నోటు రాసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి చికిత్స కోసం అత్యవసర వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. నరేశ్‌కుమార్‌రెడ్డి, గాజుల శ్రీనివాసు నుంచి రూ.60 లక్షలు ఇప్పించి న్యాయం చేయాలని సూసైడ్ నోట్ ద్వారా మృతుడు పోలీసులను కోరారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ పేర్కొన్నారు.