Government Planning on Musi River Development : మూసీ నది. దశాబ్దాల నిర్లక్ష్యం. మానవ తప్పిద్దాలకు నిలువెత్తు సాక్ష్యం. నిలువెల్లా విషాన్ని నింపుకొని ప్రవహిస్తూ ప్రభుత్వాలకు, పాలకులకు సవాల్‌గా మారుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి, మూసీ నది ప్రక్షాళన తెరపైకి వస్తుంది. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ నదినే ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. మూసీ నదిని ప్రక్షాళన కాదు, పూర్తిగా సుందరీకరణ చేసి రాష్ట్రానికి చిహ్నాంగా చూపిస్తామని చెబుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లోని థేమ్స్ నదిని పరిశీలించారు. దుబాయ్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని చూశారు.
Musi River Development Plan 2024 : ప్రపంచ స్థాయి 10 నగరాల్లో హైదరాబాద్ నగరాన్ని ముందు వరుసలో పెట్టాలంటే మూసీ నదిని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం ఒకటే మార్గమని నిర్ణయించారు. ఈ మేరకు మూసీ నది అభివృద్ధే ఎజెండాగా నగరంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రంగంలోకి దిగిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గత ప్రభుత్వాల హయాంలో చేసిన మాస్టర్ ప్లాన్‌ను పక్కన పెట్టి, కొత్తగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఇప్పటి వరకు పశ్చిమ ప్రాంతంలోనే కేంద్రీకృతమైన అభివృద్ధిని, మూసీ నది అభివృద్ధితో నగరం నడిబొడ్డుకు తీసుకొచ్చేలా ప్రణాళికలను తయారు చేసింది.
వాటికి ఆటంకం కలగకుండా : వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కొండల్లో పుట్టిన మూసీ నది, గ్రేటర్లో దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నది వెంట పరివాహక ప్రాంతాల్లో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలున్నాయి. వాటికి ఎక్కడా ఆటంకం కలగకుండా పర్యాటకంగా, సాంస్కృతికపరంగా మూసీ నది పరివాహక ప్రాంతమైన 55 కిలోమీటర్లను సుందరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలను రూపొందించింది. మూసీలో స్వచ్ఛమైన జలాలు ప్రవహించేలా, అందులో హాయిగా పడవల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది.
వాక్ టు వర్క్ ప్రాజెక్టులు, అమ్యూజ్మెంట్ పార్కులు, జల పాతాలు, వాటర్ స్పోర్ట్స్, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్ ఉండటంతో ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, చిరు వ్యాపారులకు కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
హైదరాబాద్ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్ - మూసీ నది అభివృద్ధే ప్రధానం
కొత్త ఆలోచనలతో వస్తే అప్పగిద్దాం : మూసీ నది అభివృద్ధిపై పారిశ్రామికవేత్తల ఆలోచనలు, అనుభవాలను ప్రభుత్వం సేకరిస్తోంది. భారత పరిశ్రమల సమాఖ్య వివిధ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంట్ నిపుణులు, పెట్టుబడిదారులను నగరానికి ఆహ్వానించి, మూసీ నది అభివృద్ధిపై సమాలోచనలు జరుపుతోంది. జలాశయాలు, నదీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసిన దేశాలు, నగరాలు పర్యాటకంగా మంచి అభివృద్ధిని సాధించాయి. ఆదాయపరంగా, వ్యాపార, వాణిజ్యపరంగా వృద్ధి చెందాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించిన ప్రభుత్వం, కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో వచ్చే వారికి మూసీ నది ప్రాజెక్టులను అప్పగించాలని భావిస్తుంది.
ఈసారైనా అయ్యేనా ? అయితే గత ప్రభుత్వాలు కూడా మూసీ నది ప్రక్షాళనపై భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాయి. సబర్మతి నది తరహాలో మూడు దశల్లో మూసీ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో ప్రణాళికలు సిద్ధం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.కోట్లాది బడ్జెట్ కేటాయించారు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో లేమి వల్ల మూసీ ప్రక్షాళన కాగితాలకే పరిమితమైంది. మూసీలో నుంచి తట్టెడు మట్టి కూడా బయటికి తీయలేదు. మురుగు నీరు ఇంకా అందులో చేరుతూనే ఉంది. ఈ ప్రభుత్వమైనా ఆశించిన స్థాయిలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని పర్యావరణ నిపుణులు, నగర ప్రజలు ఆశిస్తున్నారు.
గత ప్రభుత్వం దుబారా ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది : శ్రీధర్‌బాబు