Government focus on lift water from kannepalli Pump House : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన నేపథ్యంలో అక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. బ్యారేజీలో నీటిని నిల్వ చేయవద్దని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచించింది. పియర్స్‌కు రక్షణ చర్యలను చేపట్టడంతో పాటు తదుపరి పరీక్షలు చేయాలని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశ ఎత్తిపోతల మేడిగడ్డ ఆనకట్ట ఎగువనున్న కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి జరగాల్సి ఉంది. ప్రాణహిత నుంచి వచ్చిన ప్రవాహం వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత నీటిని ఎత్తిపోయాలి. అయితే బ్యారేజీలో నీరు నిల్వ చేయకపోతే ఎత్తిపోతల సాధ్యం కాదు.
దీంతో పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సరిపడా మట్టం ఆ ప్రాంతంలో ఉండేలా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. నీరు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులు, ఇంజినీర్లకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రాణహిత ప్రవాహం గోదావరిలో కలిసిన తర్వాత తాత్కాలికంగా అడ్డుకట్ట వేస్తే కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద సరిపడా నీటిమట్టం ఉంటుందని చెప్తున్నారు. ఇందుకోసం ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. జియో టెక్స్ టైల్స్, జియో ట్యూబ్య్ తదితర విధానాలపై చర్చిస్తున్నారు.
జియోట్యూబులు, బ్యాగుల వినియోగం ద్వారా నీటిమట్టం : ఇంజినీరింగ్ శాఖల బోర్డ్ ఆఫ్ ఇంజినీర్ల సమావేశం ముందు శుక్రవారం ఓ సంస్థ ప్రజెంటేషన్ ఇచ్చింది. జియో ట్యూబ్ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలను వారు వివరించారు. జియో ట్యూబ్య్ అమర్చే విధానం, తదితరాల గురించి చెప్పారు. పెద్దపెద్ద ట్యూబులు, బ్యాగుల్లో ఇసుకను నింపి నదికి అడ్డుకట్ట వేయడం ద్వారా ప్రవాహాన్ని తాత్కాలికంగా మళ్లించవచ్చని పేర్కొన్నారు. దాంతో పంప్‌హౌస్ వద్ద సరిపడా నీటిమట్టం ఉంటుందని తెలిపారు. ఈ ఏర్పాటు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, 50 నుంచి 60 ఏళ్ల వరకు మన్నిక ఉంటుందని వివరించారు.
ఆర్థికంగా కూడా చాలా తక్కువ వ్యయం అవుతుందని చెప్పారు. కాంక్రీటు విధానంలో రూ. 25 కోట్ల మొత్తం వ్యయం అయ్యే చోట జియో ట్యూబ్స్ ద్వారా కోటి రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొన్నారు. జియో ట్యూబ్స్ ఏర్పాటు కోసం పట్టే సమయం, ఇతరత్రాల గురించి తెలిపారు. వీటితో పాటు ఇతర ప్రత్యామ్నాయాల గురించి నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది. గేబియన్స్ స్ట్రక్చర్, రాక్ ఫిల్ డ్యాం తదితరాలు ఇందులో ఉన్నాయి.