AP Government Inquiry on Burning of Documents : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి దస్త్రాలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. కారులో తీసుకెళ్లి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళిక శాఖల దస్త్రాలు కాల్చారు. ఇందులో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన ఫైళ్లు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్‌శర్మ చిత్రాలు ఉండడంతో పాటు సీఎంవో లేఖలు ఉండడాన్ని చూసి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
దహనమైన డాక్యుమెంట్లపై సమీర్‌శర్మ పేరు ఉంది. కాలిపోయిన దస్త్రాలను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. సమీర్‌శర్మ సూచనలతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్లు ఇన్నోవా డ్రైవరు నాగరాజు తెలిపారు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ ఘటన స్థలానికి వచ్చారు. పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు.
హార్డ్ డిస్క్‌లతో పాటు - వీహెచ్ఎస్ క్యాసెట్లు దగ్ధం : కాగితాలు చాలా వరకు గుర్తు పట్టలేని రీతిలో కాలిపోవడంతో వాటిని బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం లేకపోయింది. కారును టీడీపీ శ్రేణులు వెంబడించడం చాలా వేగంగా అప్రమత్తం కావడంతో మరికొన్ని ఫైళ్లను వేరే ప్రాంతాల్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హార్డ్ డిస్క్‌లతో పాటు - వీహెచ్ఎస్ క్యాసెట్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి.
లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ - ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం - White Paper on Amaravati
సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు : మంత్రిగా పెద్దిరెడ్డి హయాంలో 2022-2023 సంవత్సరాలలో చేసిన ఒప్పందాలు, ఇచ్చిన అనుమతుల పత్రాలు దగ్ధం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి అనుచరులతో పాటు, ఓఎస్డీలుగా పని చేసిన అధికారుల ఆదేశాలతోనే డ్రైవరు నాగరాజు ఈ పని చేసినట్లు ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. సీఎంఓలో పనిచేసిన ముత్యాలరాజు వద్ద ఓఎస్డీ సాయి గంగాధర్ కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్‌శర్మ వద్ద ఓఎస్డీగా చేసిన రామారావు, సెక్షన్ హెడ్ శ్రీనివాస్ పాత్రలపై అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై శాఖపరంగా అంతర్గత విచారణ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింది కాబట్టే, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు టీడీపీ ఆరోపించింది. ఫైళ్ల తగలబెట్టిన దానిలో భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్రమాల గుట్టు బయటకొస్తుందనే భయంతోనే అధికారిక దస్త్రాలను ఇలా తగులబెట్టిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ - 'OG' గురించి సూపర్ అప్డేట్ - Pawankalyan Reacts on Acting