Govt Orders On Cancelling Lands Allotted To Sarada Peetham In Tirumala : ఏపీలో శారదా పీఠానికి కేటాయించిన భూములు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భూమి, అందులో భవన నిర్మాణ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023 డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు భూ కేటాయింపులు చేసింది. గత ప్రభుత్వం హాయంలో తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద శారదా పీఠానికి భూమి కేటాయించారు. తాజాగా వాటి భూకేటాయింపు, భవన నిర్మాణ తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది.
ఈ మేరకు టీటీడీ ఈవోకు దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. భూకేటాయింపు తీర్మానం తిరస్కరిస్తున్నట్లు ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ అంశంపై త్వరిత గతిన నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా భవిష్యత్లో ఈ తరహా భూ కేటాయింపులకు సంబధించిన అంశాలను తీర్మానాల కంటే ముందుగా ప్రభుత్వ పరిశీలనకు పంపాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
విశాఖ శారదాపీఠానికి భారీ షాక్ - భూ కేటాయింపులు రద్దు
కొద్దిరోజుల కిందటే విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ సర్కార్ అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే భూకేటాయింపు రద్దు ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తన గురువు, అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర కోరిందే తడవుగా భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అడ్డగోలుగా ఇచ్చేశారు. గత సర్కార్ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది. శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.