Government Focused on EX MLA kethireddy Land irregularities : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సాగించిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన భూములను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీసుల్లో వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దారు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూములు, చెరువు కలిపి మొత్తంగా 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
కబ్జాకు సంబంధించిన ఆధారాలు విడుదల : గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అండతోనే ఆక్రమణలపర్వం కొనసాగిందనేది బహిరంగ రహస్యం. 2023 ఏప్రిల్‌లో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ధర్మవరం చెరువు కబ్జాపై బహిరంగ సభలోనే ఆరోపణలు చేశారు. దీంతో వాటిని నిరూపించాలంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. దీంతో ఆ మరుసటి రోజే చెరువు కబ్జాకు సంబంధించిన ఆధారాలను లోకేశ్ విడుదల చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే కేతిరెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
'వారం రోజుల్లో ఖాళీ చేయాలి' - కేతిరెడ్డి గుర్రాల కోటకు నోటీసులు
20 ఎకరాల చెరువును మింగేశారు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. ధర్మవరం రెవెన్యూ గ్రామం పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి (కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి) భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులో ఉంది. వీటికి ఆనుకుని 908, 909, 910, 616-1 సర్వే నంబర్లలో ఉన్న చెరువు స్థలం 20 ఎకరాల వరకు ఆక్రమించి అందులో కలిపేసుకున్నారు.
ఫాంహౌస్, రేసింగ్ ట్రాక్, చెరువులో బోటింగ్ : ఇక్కడే విలాసవంతమైన ఫాంహౌస్, రేసింగ్ ట్రాక్ వంటివి నిర్మించారు. గుర్రాల కోసం ప్రత్యేక షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్నది, కొట్టేసింది మొత్తం 45 ఎకరాల్లో పలు రకాల పండ్ల తోటలు సాగు చేశారు. ఇందులో ఆశ్చర్యమేంటంటే రైతుల నుంచి తీసుకున్న కొంత భూమి కేతిరెడ్డి తమ్ముడి భార్యకు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డులో పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వసుమతికి ధర్మవరంలో వారసత్వంగా భూమి ఎలా సంక్రమించిందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైనా అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
అన్నీ మరదలి పేరు మీదే! : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన చేతికి ఎటువంటి మట్టి అంటకుండా భూములు, స్థలాలు తమ్ముడు వెంకటకృష్ణారెడ్డి, మరదలు వసుమతి పేరుతోనే ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేక్రమంలో మల్లాకాలువ గ్రామ పరిధిలో 1-1, 2-1, 2-2, పోతుల నాగేపల్లి గ్రామ పరిధిలో 43-2ఏ, 43-2బీ సర్వే నంబర్లలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన మరదలు వసుమతి, తన ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణ పేరుతో ఉంచినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు వీటిపైనా నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు - High Tension In Tadipatri