Government Appoints Inquiry Officer on Girisha : అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్ అధికారి పీఎస్ గిరీషా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుపతి లోక్ సభ ఉప-ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుల్లో జరిగిన అవకతవకలపై గిరీషాను ఈసీ సస్పెండ్ చేసింది. అప్పటి తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న గిరీషా లాగిన్ ఐడీని వినియోగించి కార్డులు డౌన్ లోడ్ చేసినట్టు అభియోగాలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఆయన పలు అభియోగాలు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి పీఎస్ గిరీషాపై విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్‌ను నియమించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై గిరీషాను జనవరిలో ఈసీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర
అయితే గిరీషాపై ఉన్న సస్పెన్షన్ గత వారంలో ఎత్తేసిన ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. తనపై ఉన్న అభియోగాలు రద్దు చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వానికి గిరీషా విన్నవించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సురేష్ కుమార్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
వివరాల్లోకి వెళ్తే, 2021 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి అక్రమంగా డౌన్‌లోడ్ చేశారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి సహకరించిన ఐఏఎస్ అధికారి గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా పనిచేసిన గిరీషా లోక్‌సభ ఉప ఎన్నికకు ఈఆర్‌ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆయన లాగిన్ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకుపైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేశారని రుజువైంది. వాటిపై ఫొటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని, స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి.
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
గిరీషా ఐడీతో వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో గుర్తించింది. ఈ ఘటనపై విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఎపిక్ కార్డుల డౌన్‌లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైనా చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపక్రమించింది. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు రెండేళ్ల తర్వాత, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫిర్యాదుతో ఈసీ ఎట్టకేలకు గిరీషాపై చర్యలు తీసుకుంది.