Singareni Karunya Appointments Age Limit Increase : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితి 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్ద కాలంగా వయోపరిమితి నిబంధన వల్ల వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను అందుకోలేకపోయారని, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బదిలీ వర్కర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారన్నారని సీఎండీ బలరామ్ పేర్కొన్నారు.
Singareni On Compassionate Appointment : 2018 మార్చి 9వ తేదీ నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీంను వర్తింపజేస్తున్నామని సీఎండీ బలరామ్ వెల్లడించారు. తద్వారా 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న దాదాపు 300 మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గరిష్ఠ వయోపరిమితి దాటిన వాళ్లు సింగరేణిలో ఉద్యోగం పొందడం కోసం దొంగ ధ్రువీకరణ పత్రాలతో తప్పుడు మార్గాలను ఆశ్రయించడం జరుగుతోందని, దాని వల్ల విజిలెన్స్ కేసులను ఎదుర్కోవడంతో పాటు వారికి వచ్చే అన్ని బెనిఫిట్స్ కోల్పోతున్నారని తెలిపారు.
Good News for Singareni Karunya Recruitment Job Seekers : వయో పరిమితి పెంపు వల్ల తప్పుడు మార్గాలను ఆశ్రయించబోరని సీఎండీ బలరామ్ అభిప్రాయపడ్డారు. తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గరిష్ఠ వయోపరిమితి పెంపునకు రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు, సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడంపట్ల సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రజా పాలనలో కూడా అనేకమంది ఈ విషయంపై దరఖాస్తు పెట్టుకున్నారన్నారు. తమ విజ్ఞప్తులను మన్నించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కూడా వయో పరిమితి పెంపుపై హర్షం వ్యక్తంచేశారు.