Gold Missing in Duvva Bank Locker: పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాంక్ లాకర‌్లో పెట్టిన బంగారం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. తణుకు మండలం దువ్వ వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 50 లక్షల రూపాయల విలువ చేసే బంగారం మాయమైందని బాధితురాలు ఉమామహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా బ్యాంకు వద్దకు వెళ్లలేదని, ఈ క్రమంలో సిబ్బంది తమ బంగారాన్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు. 2012లో దువ్వ సొసైటీలో 8 వేల రూపాయలు డిపాజిట్ చేసి లాకర్ పొందామని బాధితురాలు తెలిపారు. లాకర‌్లో ఉంచిన సుమారు 860 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు మాయమవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
Termites Eat Money : బ్యాంక్ లాకర‌్లో 'చెదలు'.. రూ.18లక్షలు స్వాహా.. ఆమెకు ఆ విషయం తెలియదట!
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం: 2012 సంవత్సరంలో దువ్వ గ్రామ సొసైటీలో లాకర్ సదుపాయం ఉండటంతో గ్రామానికి చెందిన యన్నమని ఉమామహేశ్వరి 8 వేల రూపాయలు డిపాజిట్ చేసి లాకర్ పొందారు. 2018వ సంవత్సరంలో మార్చి, సెప్టెంబర్ నెలల్లో భర్త ప్రసాద్‌తో కలిసి నాలుగుసార్లు ఆమె లాకర్ లావాదేవీలు నిర్వహించారు.
2020లో కరోనా మొదట వేవ్ రావడంతో కరోనా బారిన పడి ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అనంతరం 4 సంవత్సరాలుగా లాకర్ లావాదేవీలు నిర్వహించలేదు. తాజాగా తనతో పాటు తన బంధువులకు చెందిన బంగారాన్ని వారికి అప్పగించేందుకు లాకర్ తెరిచి చూశారు. అయితే లాకర‌్లో బంగారం కనిపించకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటూ తణుకు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బంగారంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా ఫిర్యాదు రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే ఈ ఘటనపై విచారణ చేపడతామని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.
పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన ప్యూన్.. భార్యతో కలిసి రూ.47లక్షల నగలు, డబ్బు చోరీ
"ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిగా ఉండడం, బయటికి వెళ్లలేకపోవటం వల్ల చాలా కాలంగా లాకర్ లావాదేవీలు నిర్వహించలేదు. అయితే మా కుటుంబ సభ్యుల బంగారం కూడా దువ్వ గ్రామ సొసైటీలో ఉన్న మా లాకర్లోనే పెట్టాం. ఎవరి బంగారం వారికి ఇచ్చేద్దామని నిర్ణయించుకుని సొసైటీ లాకర్‌ను బుధవారం ఓపెన్ చేయగా అంతా ఖాళీగా కన్పించింది. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పోయిన 860 గ్రాముల బంగారంపై వెంటనే తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. కొన్నేళ్లుగా లాకర్ లావాదేవీలు నిర్వహించకపోవటంతో సొసైటీ సిబ్బందే మా బంగారాన్ని మాయం చేసి ఉంటారనే అనుమానం వస్తోంది." - యన్నమని ఉమామహేశ్వరి, బాధితురాలు