Bhadrachalam Godavari Flood Flow Decrease : భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. శనివారం రాత్రి వరద ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు 52.8 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఇవాళ రాత్రి 9 గంటలకు 47.8 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరిక విరమించారు. ప్రస్తుతం 43.8 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పుడు 43 అడుగుల కంటే తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తొలగిస్తారు.
గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లో వరదనీరు చేరింది. ఈ రెండు కాలనీలలో బాధితులు స్థానిక కుర్రాజుల గుట్టలోని కొండరావు కేంద్రంలో తలదాచుకుంటున్నారు. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారిలో స్థానిక శిశు మందిరం వద్ద రోడ్డుకు అడ్డుగా కట్ట ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఘాట్ల వద్ద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు.
భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు ఆదివారం నుంచి రాకపోకలు కొనసాగగా, భద్రాచలం నుంచి విలీన మండలాలు కూనవరం, వీఆర్ పురం, చర్లలకు నేటి నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. గోదావరి వరద తగ్గడంతో గోదావరి దిగువన కూనవరం మండలంలోని శబరి వంతెన వద్ద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఒడిశా-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కొట్టుకుని రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
బాలుడి మృతదేహం రెండు రోజులు మార్చురీలో : భద్రాచలంలోని వరద ప్రవాహానికి దిగువన ఉన్న ముంపు మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కూనవరం మండలానికి చెందిన 12 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందడంతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి దారిలేక రెండు రోజులు ఆసుపత్రి మార్చురీలో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. కూనవరానికి చెందిన శివ అనే బాలుడు అనారోగ్యం బారిన పడటంతో ప్రభుత్వ అంబులెన్స్‌లో గుంటూరుకు తీసుకెళ్లారు.
పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని తిరిగి కూనవరానికి తీసుకొస్తుండగా గోదావరి వరద చుట్టూ ముట్టేసింది. దీంతో బాలుడి మృతదేహాన్ని రెండు రోజుల పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం వరద తగ్గడంతో బాలుడి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కూనవరం మండలంలోని వారి సొంత గ్రామానికి తరలించారు.
ఏడజూసినా నీళ్లే - జలదిగ్బంధంలో రహదారులు - ప్రజలకు రవాణా తిప్పలు - HEAVY FLOODS IN MULUGU