Glorious in Telugu Language Day Celebration in AP : రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనాన్ని వక్తలు కొనియాడారు. ప్రపంచలోని అన్ని భాషల్లో అతి సులువైనది తెలుగేనని వారు గుర్తు చేశారు. అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భాషాభిమానులు సూచించారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు గొప్పదనంపై చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వారిని గిడుగు రామమూర్తి పురస్కారాలతో సత్కరించారు. తనకు తెలుగంటే ఎంతో ఇష్టమని అందుకే పార్లమెంటులో తెలుగులో మాట్లాడానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. తెలుగు వాడిగా పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. అమ్మ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో భాషాభిమానులు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన కవులు ఉండటం తెలుగుజాతి గర్వించ దగ్గ విషయమని వక్తలు కొనియాడారు. తర్వాత అష్టావధానం నిర్వహించారు.
మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం: చంద్రబాబు - Telugu Language Day in Vijayawada
తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకుంటూ ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఒక్క ఇంగ్లీష్ పదం వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించాలని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు ఆయన గుర్తు చేశారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా వీరాంజనేయులుస్వామి కోరారు.
దేశ విదేశాల్లో స్థిరపడినా తెలుగు భాషను మర్చిపోకూడదని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాలలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని చదువుల్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగును మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష ఎంతో ఔన్నత్యం కలిగిన భాష అని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్యే వివరించారు. పలువురు భాషా ప్రముఖులను పార్టీ కార్యాలయంలో ఆయన శాలువాతో సత్కరించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ విద్యార్థులు నృత్యం చేశారు. సోమదేవర పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు.