Toll Free Number For Family survey : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా కాలనీల్లో జరగలేదు. అంతలోనే ప్రభుత్వం నగరంలో కుటుంబ సర్వే ముగిసినట్లుగా ప్రకటించడంతో ఆయా కాలనీవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెల్లడంతో గ్రేటర్ నగర వాసుల కోసం కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)ను ఆదేశించింది. ఈ మేరకు కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలనుకునే వారు బల్దియా కంట్రోల్ రూం నంబర్ 040 2111 1111కు సంప్రదించాలని జీహెచ్ఎంసీ శుక్రవారం ప్రకటించింది.
నగరంలో నిర్లక్ష్యంగా సమగ్ర ఇంటింటి సర్వే : జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దారితప్పింది. హైదరాబాద్‌లో వేలాది అపార్టుమెంట్లకు ఎన్యూమరేటర్లు వెళ్లకుండానే వెళ్లినట్లుగా సర్వే ఫారాలను వారే నింపేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తమకు ఆసక్తి లేదని ఆప్షన్‌తో సర్వే ఫారాలపై ఎన్యుమరేటర్లే పేర్కొంటూ సర్వే ముగిసిందనిపిస్తున్నారు. దాదాపు అధికారులు 20 శాతం ఇళ్లల్లో సమగ్ర కుటుంబ సర్వే చేయలేదు. నగరంలో డిసెంబర్ 2న సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించినప్పటికీ తమ ఇంటికి ఎవరూ రాలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో గ్రేటర్ అధికారులు దీనిపై దృష్టి సారించి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు.
అసంపూర్తిగా సమాచారం : కాగా ప్రజల నుంచి సర్వే ద్వారా సేకరించినటువంటి సమాచారం కూడా అసంపూర్తిగా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఐఏఎస్ అధికారులు, పురపాలకశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించినప్పటికీ ఫలితం నామమాత్రంగానే ఉందని సమాచారం. సుమారు 70 ప్రశ్నలతో రూపుదిద్దుకున్నటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాన్ని చూసి ప్రారంభంలో ప్రజలు తమ వివరాలను ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో ఆందోళన వ్యక్తం చేయగా వెంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఎక్కువ మంది సిబ్బంది ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోగా మరికొంతమంది దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏయే ప్రాంతాల్లో సర్వే జరగలేదంటే : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో దాదాపు 25 శాతం ఇంటింటికి స్టిక్కర్లు అతికించలేదని సమాచారం. ఆల్విన్ సొసైటీలో ఇంటింటి స్టిక్కర్లను అతికించగా సర్వే మాత్రం జరగలేదు. బాలానగర్ సాయినగర్‌లో ఇళ్లకు స్టిక్కర్లని అంటించి మమ అనిపించారు. పాతబస్తీలోని ఛత్రినాక, గౌలిపుర, మూసబౌలి, శ్రీరామ్‌నగర్‌కాలనీ, గాంధీబొమ్మకాలనీ, లంగర్‌హౌజ్‌లోని షేక్‌పేట మారుతినగర్, మారుతినగర్, బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోని నవీన్‌నగర్, ఆనంద్‌నగర్‌లోని పలు వీధుల్లో, బేగంపేట మయూరినగర్, బల్కంపేట సాయిబాబా టెంపుల్ వీధి, బ్రాహ్మణవాడి, ఓల్డ్‌కస్టమ్స్ బస్తీ, వనస్థలిపురం, ఎస్‌కేడీనగర్ బీఎన్‌రెడ్డి కాలనీతో పాటు మూసాపేట ఆంజనేయనగర్‌లోని పలు అపార్ట్‌మెంట్లను, నిజాంపేట ఇన్‌కాయిస్‌రోడ్డు, గచ్చిబౌలి జనార్ధన్‌హిల్స్ తదితర ప్రాంతాలను గాలికొదిలేశారని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.
నిర్లక్ష్యంగా ఇంటింటి సర్వే - దుకాణాలు, చెట్ల కింద కూర్చుని సర్వే పత్రాలు నింపారా?
సొంతూళ్లలోనే కుటుంబ వివరాలు వెల్లడిస్తాం - ఎన్యూమరేటర్లకు చుక్కలు చూపిస్తున్న జనాలు