Gas To Every Home Through Pipeline : దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ లాంటి మహా నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలకే పరిమితమైన ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా ఇప్పుడు గుంటూరు జిల్లా వాసులకు అందుబాటులోకి రానుంది. మంత్రి నారా లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటికి గ్యాస్ అందించనున్నారు. మహిళల వంటింటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.
మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా మంత్రి లోకేశ్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈక్రమంలోనే తొలిసారిగా మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పైపులైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ పంపిణీ దిశగా చర్యలు చేపట్టారు. ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరాకు అనుమతివ్వాలని నగరపాలక సంస్థకు మంత్రి లోకేశ్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ అనుమతులివ్వడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు పైపు లైన్ల పనులపై దృష్టిపెట్టారు. ఇప్పటికే తాడేపల్లి నుంచి కాజా వరకు 14 కిలోమీటర్ల ప్రధాన పైపులైన్ పనులు పూర్తిచేశారు. అంతర్గత రహదారుల్లో పైప్‌లైన్ల పనులు జోరందుకున్నాయి.సుమారు 220 కిలోమీటర్ల మేర ప్రధాన, అంతర్గత రహదారుల్లో పైపులైన్లను 2 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
'ఉచిత గ్యాస్'కి సూపర్ రెస్పాన్స్ - మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారా?
త్వరలోనే మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వినియోగదారుల పేర్లు నమోదు చేస్తారు. వినియోగదారులతో ఆయిల్ కంపెనీ ఉద్యోగులు సమావేశమై ముందుగా పైపు లైన్ల గ్యాస్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తారు. ఆసక్తి చూపితేనే పైపులైన్ అమర్చుతారు. వచ్చే ఏడాది మార్చి నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ఐఓసీ అధికారులున్నారు. తొలుత 20 వేల కనెక్షన్లకు సరిపడా గ్యాస్ నిల్వ చేయడానికి తాడేపల్లి వద్ద 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఆ పనులు జనవరికి పూర్తవుతాయి. చెన్నై నుంచి ట్యాంకర్ల ద్వారా లిక్విడ్ గ్యాస్ తీసుకొచ్చి తాడేపల్లి ప్లాంట్‌లో నిల్వ చేస్తారు. లిక్విడ్‌ను ఆవిరిగా మార్చి ఇళ్లకు అందిస్తారు. ఎల్‌పీజీతో పోల్చితే పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధరలు 40శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ప్రతి వినియోగదారుడూ 6 వేల 500 చెల్లించాలి. ఒకేసారి చెల్లించలేని వారు మూడేళ్లు వాయిదా పద్ధతిలో కట్టుకోవచ్చు. మీటర్లు రీడింగ్ ఆధారంగా బిల్లులు వేయనున్నారు. రెండు మాసాలకోసారి మీటరు రీడింగ్ తీసి ఎంత వినియోగించుకుంటే అంత బిల్లు చెల్లించాలి. ప్రస్తుతం గృహ సిలిండర్ ధర కన్నా తక్కువకే పైపులైన్ గ్యాస్ లభ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. పైపు లైన్ గ్యాస్ ద్వారా తమ కష్టాలు తీరుతాయని స్థానికులు చెబుతున్నారు.