Garbage Tax Burden on People : పన్నులందు వైసీపీ ప్రభుత్వ పన్నులే వేరయా అనేలా ఐదేళ్లుగా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఆఖరికి చెత్తపైన కూడా పన్ను వేసి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న జగన్ సర్కార్‌పై జనం చిర్రెత్తిపోతున్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు మౌలిక సౌకర్యాల కల్పనలోనూ విఫలమవ్వడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడలో చెత్తపన్ను సహా వివిధ రకాల పన్నుల బాదుడుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
'మురుగు'తున్న ఆటోనగర్- నెలల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలతో స్థానికుల అవస్థలు
Garbage Tax in Vijayawada : రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది ఉపాధి కోసం విజయవాడకు వచ్చి జీవనం సాగిస్తుంటారు. అందులో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలే అధికం. అలాంటి వారిపై వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా భారాలు వేస్తోంది. నగర ప్రజలు కూడా ప్రభుత్వం విధిస్తున్న పన్నుల మోతకు బలవుతున్నారు. సరైన ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే పాలకులు వివిధ పేర్లతో పన్నులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వాహణకు ఇంటి పన్ను వసూలు చేస్తున్న నగర పాలక సంస్థ యూజర్ ఛార్జీల పేరుతో మరింత భారం వేస్తోందని ప్రజలు మండిపడ్డారు.
వీఎంసీ (VMC - Vijayawada Municipal Corporation) పరిధిలో నివాసం ఉంటున్న ప్రజల నుంచి చెత్తపన్నును మురికివాడల్లో రూ.30 వసూలు చేస్తున్నారు. నాన్ స్లమ్ ఏరియాలో రూ.60 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాల్లో అయితే రూ.200 నుంచి రూ.15 వేల వరకు అధికారులు పన్నుల మోత మోగిస్తున్నారు. విజయవాడలో సుమారు 15 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. నగరంలో 220 క్లాప్ వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. నగర పారిశుద్ధ్యం కోసం సుమారు 3 వేల 600 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా చాలా కాలనీల్లో నిర్వాహణ అధ్వానంగా ఉంటోంది. దీంతో ప్రజలు దోమలు, ఈగలు వంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో లేదని నగర వాసులు మండిపడుతున్నారు. నగర ప్రజలపై ఎడాపెడా పన్నుల మోత తగ్గించాలని, లేకపోతే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెబుతామని ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.