Ganja Smuggling Through Inter State Borders : గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తెలంగాణ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా, ప్రతి రోజూ ఎక్కడో ఒక్క చోట కేసులు బయటపడుతున్నాయి. పోలీసులు దీనిపై ఉక్కుపాదం మోపుతుండగా, అక్రమార్కులు కొత్త తరహాలో రవాణా చేస్తున్నారు.
యువతను మత్తుకు బానిసగా మారుస్తున్న గంజాయి వినియోగానికి రాష్ట్ర సరిహద్దులు గేట్‌వేగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు అంతర్రాష్ట్ర సరిహద్దులను డంపింగ్ పాయింట్ మార్చుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ప్రాంతాలనే ప్రధాన కేంద్రాలుగా వాడుకుంటున్నారు. మరోవైపు ప్రత్యేక నిఘా పెడుతున్న పోలీసులు తరచూ వందల కిలోల సరకును స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా రవాణాదారులు వ్యుహాలు మార్చేస్తున్నారు. తద్వారా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతంర మత్తు పదార్థాల వినియోగంపై కట్టడి చర్యలకు ఉపక్రమించింది. అక్రమ రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చింది. గంజాయి రవాణాపై నిఘా పెరగడంతో వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
గంజాయి రవాణా చేస్తున్న వాహనాల డ్రైవర్లకు భారీ నజరానాలు ప్రకటిస్తున్నాయి. పోలీసులకు దొరకకుండా ఉండటానికి ప్రాంతానికో సెల్‌ఫోన్ వాడటం, సొంత చెక్‌పోస్టులు ఏర్పాటు వంటి వ్యూహాలు అనుసరిస్తున్నట్లు విచారణలో తెలింది. గంజాయి రవాణా కోసం పశ్చిమ బెంగాల్, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దాటే వరకు నకిలీ నెంబర్ ప్లేట్లను, తెలంగాణలోకి రాగానే ఇక్కడి నెంబర్ ప్లేట్‌ను బిగిస్తూ దర్జాగా సరిహద్దు దాటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా గంజాయి రాష్ట్రంలోకి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, మన్యం నుంచి రాష్ట్ర సరిహద్దు దాటించే వరకు తెలంగాణకు చెందిన వ్యక్తే కీలకమని పోలీసుల విచారణలో తేలింది. మన్యంలో కిలో రూ.2 వేలు-రూ.5 వేలకు కొనుగోలు చేసి మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, గోవా ప్రాంతాల్లో రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సినీ ఫక్కిలో రవాణా : ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి డమ్మీ నంబరు ప్లేట్లు ఉన్న కార్లలో గంజాయి తరలిస్తున్నారు. నిందితులు వేగంగా వాహనాలు తీసుకెళ్తూ సినీ తరహాలో తప్పించుకుంటున్నారు. ఇటీవల పటాన్‌చెరు బాహ్య వలయ రహదారి సమీపంలో 220 కిలోల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకోబోతే పరారయ్యారు. పోలీసులు వెంబడించి ఇస్నాపూర్ సమీపంలో వారిని పట్టుకున్నారు.
గంజాయి రవాణాకు జహీరాబాద్ కేంద్రమైనట్లు పోలీసులు గుర్తించారు. స్మగ్లర్లు విశాఖ మన్యం, భద్రాచలం ఏజెన్సీ నుంచి తెప్పిస్తూ అంతర్రాష్ట్ర సరిహద్దు ఈ ప్రాంతం మీదుగా మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని గొట్టంగుట్ట అటవీ ప్రాంతంతో పాటు జహీరాబాద్ శివారులోని నిర్మానుష్య ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను అడ్డాగా చేసుకోని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇక్కడి నుంచి బీదర్, గుల్బర్గా, ముంబయి, షోలాపూర్, నాందేడ్, గోవా ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, ఇతరత్రా వాటిపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు మరింత నిఘా పెంచారు.
రోజుకో మర్డర్ - పూటకో దోపిడీ - ఈ భాగ్యనగరానికి ఏమైంది? - Crime Rate Increasing in Hyderabad