Ganja Seized Near CM Jagan House: ఒక దేశ భవిష్యత్తుకు వెన్నెముక యువత. నాణ్యమైన మానవ వనరులుగా మారి ప్రగతిలో యువత భాగస్వామ్యమైతేనే దేశం మరింతగా ముందుకు సాగుతుంది. అయితే అలాంటి యువత ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మత్తలో పడి తమ జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. అయిదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే ఇందుకు కారణం. తాజాగా ఎంతో హైసెక్యూరిటీ జోన్‌గా ఉండే సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి గుప్పుమంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి విక్రేతలు పట్టుబడటం కలకలం రేపింది. నవోదయ కాలనీ వద్ద ఆదివారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు యువకులు గంజాయి పెట్టుకుని సంచరిస్తుండగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించారు. వారిలో ఒకరు పరారవగా, మిగిలిన ఇద్దరు ఎదురుతిరిగి దాడికి యత్నించారు.
దీంతో స్థానికులంతా ఏకమై వారికి దేహశుద్ధి చేసి చేతులను తాళ్లతో కట్టేశారు. వారి వద్ద 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైసెక్యూరిటీ జోన్‌గా ఉన్న సీఎం క్యాంపు కార్యాలయ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. యువకులు ఎక్కడ నుంచి వచ్చారు? ఎంత మంది ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. యువకులు గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్ - డ్రగ్స్ స్మగ్లింగ్‌లో దేశంలోనే టాప్ - DRUGS SMUGGLING IN AP
Karnataka Liquor Seized: ఒకవైపు గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతుంటే, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా సైతం భారీగా జరుగుతోంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డొనేకల్లు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బస్సులో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 744 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి కర్నూలుకు అక్రమంగా తరలించి విక్రయించడానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Ganja Smuggling in AP: కాగా గంజాయి అత్యధికంగా పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో 2019, 2021లో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, 2020లో 2వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో పట్టుబడిన గంజాయి విలువే 8 వందల కోట్ల రూపాయలపైనే ఉంటుంది. రాష్ట్రంలో గంజాయికి బానిసైన వారు 4 లక్షల 64 వేల మంది ఉండగా, అందులో 21 వేల మంది 10 నుంచి 17 ఏళ్ల లోపు వారే ఉన్నారు.