Ganja Chocolates in Jeedimetla : హైదరాబాద్ నగరంలో గంజాయి సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, వాటి విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల కాలంలో చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తూ స్మగ్లర్లు యువకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల రాంరెడ్డి నగర్‌లో ఓ కిరాణా దుకాణంలో విక్రయిస్తున్న గంజాయి చాక్లెట్లను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన శిబుకుమార్ అనే యువకుడి నుంచి రూ.11,500 విలువ చేసే 150 గంజాయి చాక్లెట్లను జప్తు చేశారు.
మరో కేసులో నగర శివారు పటాన్‌చెరులో కిరాణా షాపు నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన సీతారాం సింగ్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. రూ.30 వేల విలువ చేసే 1,960 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిజాంపేట్‌లోని రెండు పాన్ షాప్‌లపై దాడులు చేసిన పోలీసులు, రూ.16 వేల విలువ గల 114 ప్యాకెట్ల నిషేధిత సిగరెట్స్‌ను జప్తు చేశారు.
ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం - ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఒకప్పుడు యువత - ఇప్పుడు పిల్లలే టార్గెట్ : గంజాయి ముఠాలు ఒకప్పుడు యువతను టార్గెట్‌గా చేసుకుని మత్తు పదార్థాలు అలవాటు చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు వీరి కన్ను పచ్చని విద్యాలయాలపై, ముక్కుపచ్చలారని పిల్లలపై పడ్డాయి. ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్ నుంచి ఏకంగా పాఠశాలలకు గంజాయి ముఠాలు చేరుకున్నాయి. వారి అక్రమ సంపాదన కోసం పిల్లల ఉజ్వల భవిష్యత్తును మత్తులో ముంచేస్తున్నాయి. గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తూ చిన్న పిల్లల్ని మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి.
ఆలస్యమైతే మరింత ప్రమాదం : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు పాఠశాలల వద్ద ఇలాంటి కార్యకలాపాలను యథేచ్ఛగా నడుపుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల వద్ద ఉండే కొన్ని దుకాణాల్లో ఇవి లభ్యమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి సేవిస్తున్న వారు మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండానే వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. మత్తులో వావివరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయకపోతే, రానున్న రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.