Thefts Training In Hyderabad : మోసాలు, దొంగతనాల్లో ఆరితేరిన ముఠాలు ఆనవాళ్లు బయటకు తెలియకుండా నయా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. యువత, మైనర్లను ముందుంచి నేరాలు చేయిస్తున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాన్ని కొట్టేయటం నుంచి నకిలీ అధికారుల రూపంలో బురిడీ కొట్టించటం దాకా నేర్పిస్తున్నాయి. అనంతరం వారిని ఆయా బృందాలకు నాయకులుగా నియమిస్తున్నాయి. మోసాల్లో ఎక్కువ సంపాదించిన వారికి రెండు మూడు రెట్లు జీతం అదనంగా ఇస్తున్నాయి.
ఉదాహరణలివే : అతడు ఓ పాతబస్తీ నేరస్తుడు. వందకు పైగా కేసుల్లో జైలుకు వెళ్లాడు. సొమ్ము కొట్టేసేందుకు కొత్త మార్గం ఎంచుకున్నాడు. పనీపాటలేకుండా ఖాళీగా ఉండే యువకులకు బిర్యానీ, బైక్‌లపై తిరిగేందుకు పెట్రోల్ ఖర్చులు ఇస్తూ సెల్‌ఫోన్ల దొంగతనం నేర్పించాడు. నగరంలో రాత్రిళ్లు వివిధ ప్రాంతాల్లో వారు తిరుగుతూ చోరీ చేసిన మొబైల్ ఫోన్లను దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇటీవల బహదూర్‌పురలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడి పక్కనే కూర్చున్న బాలుడు, జేబులోని నగదు కొట్టేశాడు. చాదర్‌ఘాట్ వద్ద మరో యువకుడు ఓ వ్యక్తి మొబైల్ లాక్కొని పారిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు కమీషన్ వస్తుందనే ఆశతో నేరాలకు పాల్పడ్డామని, వారుండే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు చోరీలపై శిక్షణ ఇచ్చారంటూ సమాధానమిచ్చారు.
శిక్షణ కొనసాగుతుందిలా : నగర శివార్లకు చెందిన దొంగలు బైకుల తాళాలు తీసి క్షణాల్లో మాయం చేసే మహ మోసగాళ్లు. చదువులు, తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరమైన 12-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలతో మాట మాట కలుపుతారు. కొద్దిరోజులు నగరమంతా తిప్పుతారు. బైకులపై ఫీట్లు చేయటం వంటివి నేర్పిస్తారు. తాళం వేసిన బైక్‌లను ఎలా చోరీ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనేదానిపై రాత్రిళ్లు శిక్షణ ఇస్తారు. చోరీ చేసిన ఒక్కో వాహనానికి రూ.2-3 వేలు కమీషన్ ఇస్తారు.
అంతర్రాష్ట్ర ముఠాలు సైతం మొబైల్ ఫోన్ల చోరీలకు మహిళలు, మైనర్లును పావులుగా వాడుకుంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఫోన్ల చోరీపై శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు పట్టుబడినపుడు వెంటనే అక్కడున్న మహిళలు అడ్డుకుని, తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని గొడవ చేయాలని సూచిస్తున్నారు. ఫోన్ కొట్టేశాక సమీపంలోని ముఠా సభ్యుడికి అందజేసే వరకూ ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నట్టు ఇటీవల పట్టుబడిన ఇద్దరు చిన్నారులు వెల్లడించారు.
కన్నేస్తాడు - గెటప్ మార్చేస్తాడు - ఆపై కొట్టేస్తాడు - తర్వాత ఎంచక్కా! - Gold theft in hyderabad