Ganesh Navratri 2024 Celebrations : రాష్ట్రంలో గణేశ్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది. గ్రామగ్రామాన వివిధ ఆకారాల్లో కొలువు దీరిన వినాయకులు పూజలందుకుంటున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో కొలువైన 70 అడుగుల సప్తముఖ గౌరీ సుతుణ్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండోలుగా తరలివస్తున్నారు. మహా గణపయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి.
కిషన్ రెడ్డి పర్యటన : ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో కలిసి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. మండపం వద్ద పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ అంజయ్యనగర్‌లో కుల, మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకూ ఓ ముస్లిం యువకుడు అన్నీ తానై చూసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఇరవయ్యేళ్లుగా ఇక్కడ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఆ యువకుడు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు వెల్లడించారు.
"రాష్ట్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. రాష్ట్రంలో ఎటువంటి వరదలు, ఇబ్బందులు లేకుండా చూడాలని గణేశుణ్ని కోరుకున్నాను". - కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద ఏర్పాటు చేసిన గణనాధుడిని టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విఘ్నేశ్వరుని ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాలకు ముందు వినాయక ప్రతిమను వాహన శ్రేణులతో ఊరేగింపు చేయడం ఇక్కడి ఆనవాయితీగా నిర్వాహకులు చెబుతున్నారు.
వినాయక లడ్డూ చోరీ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఓ చిన్నారి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. మండపం వద్ద చిన్నారి స్తైర్య భరతనాట్యం చేసి అందరినీ అలరించింది. వినాయక నవరాత్రులు అంటే పూజలు, భజనలు, నృత్యాలు ఉంటాయనుకుంటే పొరపాటే. లడ్డూ దొంగలు కూడా ఉంటారని నిరూపించాడో యువకుడు. బాచుపల్లి ఠాణా పరిధిలోని ఓ అపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అర్ధరాత్రి ఓ దొంగ లడ్డూ తీసుకుని ఉడాయించాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ బొజ్జగణపయ్యలు కాస్త డిఫరెంట్ - మీరూ చూసేయండి - Variety Ganesh Idols In Warangal