Ganesh Immersion in hyderabad : రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ప్రక్రియ అంగరంగ వైభవంగా సాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్నబొజ్జగణేశుడిని గంగాదీశున్ని చేసేంత వరకు యువత డీజే చప్పుళ్లకు స్టెప్పులేస్తూ ఆధ్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్‌లో ఓ పక్క నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో రహదారులను శుభ్రం చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతం చేసినందుకు అధికారులు, సిబ్బందికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి ధన్యవాదములు తెలిపారు.
సచివాలయం,అమరుల స్థూపం ప్రాంతాల్లో రద్దీ : గణేశ్ నిమజ్జన ప్రక్రియ జరుగుతున్న ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి వచ్చే విఘ్నేశ్వరులతో సచివాలయం,అమరుల స్థూపం ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను తరలిస్తున్నప్పటికీ ఆయా మార్గాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మెదక్‌లో గణనాథుల నిమజ్జనోత్సవ శోభాయాత్ర : మెదక్‌లో గణనాథుల నిమజ్జనోత్సవ శోభాయాత్ర వైభవంగా సాగింది. డీజే చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనల మధ్య గణనాధులు స్థానిక బంగ్లా చెరువుకు తరలివెళ్లారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో డోలువాయించి యువకులలో ఉత్సాహాన్ని నింపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక సాగర్ చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన క్రతువు ప్రశాంతంగా ముగిసింది.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు జరిగిన శోభాయాత్రలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఘనంగా జరిగిన శోభాయాత్ర తర్వాత గణనాథుడు గంగమ్మ ఒడిలో సేద తీరాడు. భారీ క్రేన్‌ను ఉపయోగించి హుస్సేన్‌సాగర్‌లో గణపతిని నిమజ్జనం చేశారు. ఈసారి 70 అడుగుల మట్టి గణపయ్యను ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం రికార్డుగా ఉంది.
వైభవంగా ముగిసిన బాలాపూర్ మహాగణపతి నిమజ్జనం - Balapur Ganesh Immersion 2024