Ganesh Idols Making In Dhoolpet 2024 : ఏటా రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుపుకునే పండుగ దసరా అయితే హైదరాబాద్ వాసులకు మాత్రం గణేశ్ చతుర్థే పెద్ద పండుగ. బోనాల పండుగలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తే గణేశ్ పండుగను మాత్రం ఊరూరా కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకుంటారు.
ఇంటింటా చందాలు వేసుకుని గణేషుడిని ప్రతిష్ఠించి నవ రాత్రులు పూజలు చేసి డప్పు చప్పుళ్లతో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. మరో 2 నెలల్లో ఈ ఉత్సవాలు రానుండటంతో నగరంలో లంబోధరుల తయారీలో కార్మికులు నిమగ్నమయ్యారు. మారుతున్న ప్రజల అభిరుచులకు అణుగుణంగా కొత్త కొత్త రూపాల్లో బొజ్జ గణపయ్యలను తయారు చేస్తున్నారు. అడుగు నుంచి 60 అడుగుల వరకూ ఎన్నో ప్రతిమలు వారి చేతిలో ప్రాణం పోసుకుంటున్నాయి.
"ముందు కంటే ఇప్పుడు రేట్లు చాలా పెరిగిపోయాయి. ఒకప్పుడు లక్ష రుపాయలు ఉన్న పెద్ద గణేశ్ విగ్రహాలు ఇప్పుడు రెండు లక్షలు పలుకుతున్నాయి. పండగ దగ్గర పడే సమయంలో వస్తే అసలు విగ్రహాలే దొరకడం లేదు. అందుకే రెండు మూడు నెలల ముందే వచ్చి విగ్రహాలను కొంటున్నాం." - కొనుగోలుదారులు
Diamond and Gold Ganesh : బొజ్జ గణపయ్యకు వజ్రాల ఆభరణాల అలంకరణ.. చూస్తే రెండు కళ్లు చాలవంట!
ధూల్‌పేటలో ఏ ఇళ్లు చూసినా ఏ గల్లీకెళ్లినా గణేశ్ ప్రతిమల తయారీ దృశ్యాలే దర్శనమిస్తాయి. మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగాల్ రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. వాళ్లలో ఏళ్లుగా ఇదే పని చేసుకుంటూ ఇక్కడే స్థిరపడినవారు కొందరైతే సీజన్‌లో వచ్చి వెళ్లేవారు మరికొంత మంది ఉన్నారు. వినాయక చవితికి 3 నెలల ముందు నుంచే డిమాండు మేరకు ప్రతిమల తయారీ మొదలుపెడతామని తయారీదారులు చెబుతున్నారు. ఏడాదంతా ఇదే పని చేస్తుంటామని పండగ రోజుల్లో కాస్త ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.
"సంవత్సరకాలం పాటు విగ్రహాలను మేమే తయారు చేస్తాం. కొన్ని నెలలు వినాయకుని విగ్రహాలు తయారు చేస్తే, కొన్ని సార్లు అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తాం. విగ్రహాల తయారీలో 50శాతం పీవోపీ ఉంటే మిగతా అంతా క్లే ఉంటుంది. ముఖ్యంగా గణేశ్ విగ్రహాల తయారీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి రప్పించుకుంటాం. ముడిసరుకు కూడా అక్కడి నుంచే తీసుకువస్తాం." - విక్రయదారులు
పీవోపీ విగ్రహాలకే బాగా డిమాండ్ : ఏటా గణేశ్ విగ్రహాల తయారీ అమ్మకాల ద్వారా వందల కోట్ల వ్యాపారం సాగుతోంది. ధూల్ పేటలో తయారు చేసిన విగ్రహాలకు మంచి గిరాకీ ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ తయారుచేసిన విగ్రహాలను తరలిస్తుంటారు. నచ్చిన ఆకృతుల్లో గణేశుని ప్రతిమలు కావాలంటే ముందుగానే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని కొనుగోలుదారులు అంటున్నారు. ఏటా మట్టి విగ్రహాలను కాకుండా పీవోపీ విగ్రహాలనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడంతో తయారీదారులు వాటికే మొగ్గుచూపుతున్నారు.
Cow Dung Ganesh Idols Nirmal 2023 : పర్యావరణాన్ని కాపాడే.. గోమయ గణపయ్యను చూసొద్దామా..?