Ganesh Ongoing Immersion in Hussain Sagar : 'జై గణేశ్ మహారాజ్ కీ జై' అంటూ భాగ్యనగరం మొత్తం నామస్మరణ మార్మోగిపోతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కనులపండుగగా గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం గణేశుడి నిమజ్జనానికి విచ్చేసిన భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంతో సందడి నెలకొంది. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని హుస్సేన్‌సాగర్‌లో కనులారా వీక్షించేందుకు భారీ తరలివచ్చారు.

దీంతో హుస్సేన్ సాగర్ ప్రాంతాలైన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం ఐ మ్యాక్స్ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్‌సాగర్‌లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లిరావయ్యా గణపయ్య మళ్లీ అంటూ జనాలు నీరాజనం పలుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ముగిసిన ఖైరతాబాద్ శోభాయాత్ర : ఖైరతాబాద్ మహాగణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. హుస్సేన్‌సాగర్‌లోని 4వ నెంబరు క్రేన్ వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతిని తిలకించేందుకు భక్తులు భారీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. గణపతి నామస్మరణతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో మార్మోగాయి. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణం అయింది. పోలీసులు భారీగా పోలీసుల భద్రతను నిర్వహించారు. గణేశుడు గంగమ్మ చెంతకు వెళ్లినప్పుడు భక్తులు తమ సెల్ఫోన్లలో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన దృశ్యాలను వీడియో, సెల్ఫీల రూపంలో భద్రపరచుకున్నారు.


ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత : గణపతి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో మెట్రో సిబ్బంది మెట్రో స్టేషన్ గేట్లను మూసివేశారు. పది నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. మెట్ల వద్ద గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న బాలాపూర్ శోభాయాత్ర : మరోవైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో భక్తులు నృత్యాలు చేస్తున్నారు. బాలాపూర్ గణేశ్ శోభాయాత్రను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు జరుగుతున్నాయని, దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రూ.30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024