Fuel Supply to Tanker For Bunk Owners in Jungle Clearance Works: రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జేసీబీలు, భారీ యంత్రాలు ముళ్లకంపల్ని తొలగిస్తున్నాయి. అయితే ఈ వాహనాలకు ఇంధనం కోసం పెట్రోల్ బంకులకు వెళ్లడం శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే ట్యాంకర్లతో ఇంధనాన్ని నేరుగా పనులు జరుగుతున్న ప్రదేశాలకే తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు. ఇది అమరావతి ప్రాంతంలో కనిపిస్తున్న సాధారణ దృశ్యం.
డీజిల్ ట్యాంకర్ నేరుగా జంగిల్ క్లియరెన్స్ జరుగుతున్న చోటకే వచ్చి ఆయా వాహనాలు, యంత్రాలకు కావాల్సిన మేరకు ఇంధనం నింపి వెళ్తోంది. జేసీబీ యజమానుల విజ్ఞప్తి మేరకు మందడంలోని భారత్ పెట్రోలియం బంకు యాజమాన్యం ట్యాంకర్లతో ఇంధనాన్ని నేరుగా పనులు జరుగుతున్న ప్రదేశాలకే వెళ్లి సరఫరా చేసే ఏర్పాటు చేసింది. బంకులో విక్రయించే ధరకే క్షేత్రస్థాయికి వెళ్లి ఇంధనం సరఫరా చేస్తున్నారు. గతంలో రాజధాని పనులు జరిగిన సమయంలో అమరావతి ప్రాంతంలో 4 పెట్రోల్ బంకులు ఉండేవి.
ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు- రాజధాని రైతుల సంతోషం - farmers About Jungle Clearance
పనులు జరుగుతున్న చోటుకే ట్యాంకర్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని పట్టించుకోకుండా పనులు నిలిచిపోయాయి. దీంతో అమరావతిలో పనులు నిలిచిపోవడంతో పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గి రెండు బంకులు మూతపడి పోయాయి. మిగతా రెండింటిలోనూ ప్రస్తుతం ఒక్క దానిలోనే మాత్రమే డీజిల్ లభ్యమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజధాని ప్రాంతంలో పనులు ఊపందుకోవడంతో అక్కడ పని చేసే వాహనాలకు భారీగా ఇంధనం అవసరమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలతో తమ వ్యాపారం పుంజుకుంటుందనే నమ్మకం కలుగుతోందని బంకు యజమనాలు అంటున్నారు. గతంలో ఎంతో పెట్టుబడి పెట్టి ప్రారంభించిన బంకులు అర్ధాంతరంగా నిలచిపోవడం తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జంగిల్ క్లియరెన్స్ కోసం బయట ప్రాంతాల నుంచి ఇంధనాన్ని డ్రమ్ముల్లో నింపి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో తీసుకురావడం ప్రయాసగా మారింది. అందుకే జేసీబీలు, ఇతర యంత్రాల యజమానుల విజ్ఞప్తి మేరకు బంకు యాజమాన్యం పనులు జరిగే ప్రాంతానికే ట్యాంకర్ వచ్చి డీజిల్ సరఫరా చేస్తోంది. ట్యాంకర్‌తో ఇంధనం సరఫరా వల్ల ఇబ్బందులు తప్పాయని జేసీబీ నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కసారి ట్యాంక్ పూర్తి నింపితే రెండు రోజుల వరకూ ఇంధనం సరిపోతుంది. ట్యాంకర్ ద్వారా తమకు వ్యాపారం పెరిగిందని బంకు ప్రతినిధులు తెలిపారు.