Robbery Gang Killed Old Couple in Khammam : అదో దండుపాళ్యం తరహా ముఠా.. ఆస్తి ఉన్న వృద్ధులే వారి టార్గెట్.. ఆసుపత్రుల్లో పరిచయం చేసుకుని ఫోన్ నంబర్లు సేకరిస్తారు. ఈ నేపథ్యంలో ఇంట్లో అద్దెకు దిగుతామంటూ మాటలు కలిపి దగ్గరవుతారు. ఒకట్రెండుసార్లు వృద్ధుల ఇళ్ల పరిసరాలను పరిశీలిస్తారు. సరైన సమయం చూసుకుని వృద్ధులను మట్టుబెట్టి బంగారం, సొమ్ము కాజేస్తారు. సరిగ్గా ఈ తరహాలో గత నెల 27న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల శివారు కొత్తకొత్తూరులో వృద్ధ దంపతుల హత్య జరిగినట్లు తెలిసింది. ఓ నిందితుడి ఫోన్‌కాల్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. ఆ వృద్ధ దంపతులను బంగారం, డబ్బు కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.
జగ్గయ్యపేటకు చెందిన నిందితుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 15 రోజుల క్రితం కొత్తకొత్తూరులో వృద్ధ దంపతులు యర్ర వెంకటరమణ, కృష్ణకుమారి తమ సొంతింట్లో దారుణహత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లభించకుండా పక్కా పథకం ప్రకారం నిందితులు వ్యవహరించారు. దీంతో పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్‌గా మారింది. మూడు నెలల క్రితం వృద్ధ దంపతులు అనారోగ్యం బారినపడి ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో దొంగల ముఠా సభ్యులు ఆ వృద్ధ దంపతులను పరిచయం చేసుకుని ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తకొత్తూరులోని దంపతుల భవన సముదాయంలో అద్దెకు దిగుతామంటూ మహిళలు తరచూ అక్కడికి వెళ్లేవారు.
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ! : వృద్ధ దంపతులు కూడా ఆ మహిళలకు పలమార్లు తమ ఇంట్లోనే భోజనం పెట్టారు. దీంతో వీరంతా కలిసిపోయారు. తర్వలోనే ఇంట్లో అద్దెకు వస్తామంటూ వృద్ధులను నమ్మించారు. ఇందులో భాగంగా గత నెల 27న రాత్రి నలుగురు వచ్చి వృద్ధ దంపతులను మట్టుబెట్టారు. ఈ కేసును ఛేదించేందుకు సీపీ సునీల్‌దత్ ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించగా కాల్‌డేటా, సీసీ కెమెరాల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. దాదాపు పదిరోజులపాటు ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్య చేసిన నలుగురిలో ఓ నిందితుడు చివరగా వృద్ధుడు వెంకటరమణకు ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు తన మొబైల్‌తోపాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను కూడా ఒక్కొక్కటి ఒక్కోచోట పడేయటంతో కాల్‌డేటా, జీపీఆర్ఎస్తో మరికొన్ని ఆధారాలు సేకరించారు. అయితే నిందితుల మూడు ఫోన్లల్లో ఓ ఫోన్ నంబర్ జగ్గయ్యపేట వాసి పేరిట నమోదైంది. దీంతో పోలీసులు పూర్తి వివరాలను రాబట్టి పోలీసుశాఖలో అతడిపై ఉన్న కేసుల వివరాలను సేకరించారు. 2012లో సదరు వ్యక్తిపై హత్య కేసు నమోదైందని తెలుసుకోవడంతో తమదైన శైలిలో దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిందితులను ఇవాళ(గురువారం) మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వృద్ధ దంపతుల ప్రాణం తీసిన కోతి చేష్టలు - అసలు ఏమైందంటే? - Old Couple Died Due To Monkey
ఒంటరి మహిళలే ఆ 'సీరియల్ కిల్లర్' టార్గెట్ - కనిపిస్తే దోపిడీ, హత్య - చివరకు?