Former Special CS Srilakshmi Power Abuse: ఆయనేమీ స్వాతంత్య్ర సమరయోధుడు కాదు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప సంఘ సేవకుడు అంతకంటే కాదు. రైల్వే శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఇంజినీర్. మచిలీపట్నంలో ఈ ఏడాది జనవరిలో వై.నాగేశ్వరరావు స్మారకంగా ఒక పార్కును ప్రారంభించి అందులో ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో అనేకమంది ఉద్యోగులు ఏటా పదవీ విరమణ చేస్తుంటారు. వారందరికీ లేని ప్రత్యేకత నాగేశ్వరరావులో ఏముందని అనుకుంటున్నారా? ఆయన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి తండ్రి కావడమే.
నాగేశ్వరరావు పేరుతో రూ. 2.18 కోట్ల ప్రజాధనంతో అధికారులు నిర్మించిన అందమైన పార్కును ఈ ఏడాది జనవరి 24న శ్రీలక్ష్మి ప్రారంభించారు. రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ. 2 కోట్లు, మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి మరో రూ. 18 లక్షలు పార్కు ఏర్పాటుకు ఖర్చు చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి పార్కు లోపల నాగేశ్వరరావు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలోని రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు పట్టణాల్లో అమృత్ పథకంలో ఉద్యానవనాలు నిర్మించారు. ఈ క్రమంలో తన తండ్రి పేరుతో స్వస్థలం మచిలీపట్నంలో పార్కు ఏర్పాటు చేయించాలన్న యోచనతో ఉన్నట్లు శ్రీలక్ష్మి చెప్పడమే తడవుగా గ్రీన్, బ్యూటిఫికేషన్ సంస్థ అధికారులు రంగంలో దిగారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ అనుమతితో అమృత్ పథకంలో పార్కు ఏర్పాటుకు డిజైన్లు తయారు చేయించి శ్రీలక్ష్మి అనుమతితోనే టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పథకంలో భాగంగా పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాయి. ప్రత్యేకించి పార్కులకు ఆ ప్రాంతంలోని ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. మచిలీపట్నంలో పార్కుకు పేరు పెట్టిన నాగేశ్వరరావు రైల్వేలో ఇంజినీర్‌గా వేర్వేరు ప్రాంతాల్లో పని చేశారు తప్పితే మచిలీపట్నంలో రైల్వే పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేంత కృషి ఏమీ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీలక్ష్మి తలుచుకుంటే ఇంకేమైనా ఉందా! ప్రజాధనంతో తండ్రి పేరుతో నిర్మించిన పార్కును తనే ప్రారంభించారు. తండ్రి విగ్రహం ఏర్పాటుకు అయిన ఖర్చు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని సమాచారం.
శ్రీలక్ష్మిపై హైకోర్టు వ్యంగ్యాస్త్రం... ఆమే 'సిన్సియర్' సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అంటూ..