Harish Rao about Power Cuts in Telangana : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. విద్యుత్ కోతల అంశంపై ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంట్ పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరవయ్యారని ఆక్షేపించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు కోరారు.
జర్నలిస్టులను అరెస్టు- మీడియా హక్కును కాలరాయడమే : మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థుల దగ్గరకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహిణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 10, 2024
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?
జర్నలిస్టులను అరెస్టు… pic.twitter.com/urarBfBlEN
జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి గారివి పరిణితి లేని వ్యాఖ్యలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 9, 2024
మీరు గతం మరిచిపోయినట్టున్నారు!
నాడు...గ్రూప్ 2, టెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్
చెయ్యాలని అభ్యర్థులు అడిగితే
మద్దతు తెలపలేదా మీరు?
అప్పుడు సానుకూలంగా నిర్ణయం
తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీరు ఇప్పుడెందుకు… https://t.co/3Q1l8pOUbk pic.twitter.com/da1HOFt4FG
అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా : పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పరిణితి లేనివని హరీశ్‌రావు అన్నారు. గతంలో గ్రూప్ 2, టెట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దుతుగా ఉండలేదా అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేశారని ఆక్షేపించారు.