Former CID ASP Vijay Pal Transfer to Guntur : ప్రస్తుత స్పీకర్, అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టోడియల్ టార్చర్ కేసులో విశ్రాంత ఏఎస్పీ విజయ్ పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజును వేధించిన వ్యవహారంలో కుట్ర దాగి ఉందని కుట్రదారులు ఎవరో తేలాలంటే పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈమేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది.
ప్రస్తుత ఉపసభాపతి, అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో 27 మందిని విచారించిన పోలీసులు మంగళవారం సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయ్‌పాల్‌ను అరెస్టు చేశారు. ఒంగోలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు.
ఆ తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో విజయ్‌పాల్‌తో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించారు. విచారణకు హాజరైనప్పుడు విజయ్‌పాల్ తీసుకువచ్చిన వాహనం, సెల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రఘురామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, నవ్వుతూ సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి కనీసం నడవలేని స్థితిలో బయటకు వచ్చారని కోర్టుకు విన్నవించారు. రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారని తెలిపారు. అంతే కాకుండా గుండెలపై కూర్చుని చావబాది చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు. రఘురామను వేధించిన విషయం వీడియో అప్పటి పెద్దలకు పంపారని తెలిపారు. మిలిటరీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలు ఉన్నాయని ఈ కేసులో 27 మందిని విచారించిన తర్వాత విజయ్ పాల్‌ను అరెస్టు చేశామని తెలిపారు.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కుట్ర దాగి ఉందని కుట్రదారులు ఎవరో తేలాలంటే పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రఘురామను అరెస్టు చేసిన రోజు సీఐడీ కార్యాలయానికి సునీల్ కుమార్ వచ్చారన్న సెంట్రీ స్టేట్‌మెంట్, ఆయన సెల్ ఫోన్ లొకేషన్ రిపోర్ట్ కీలకంగా మారాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పటి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ 2021 మే 14న అరెస్ట్ చేసింది. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించి విచారించింది. ఆ సమయంలో హత్యాయత్నం చేశారని అప్పట్లోనే రఘురామరాజు కోర్టుకు నివేదించారు. కానీ వైద్యులు ఇచ్చిన తప్పుడు నివేదికలతో బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామ ఫిర్యాదుతో ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఆనాటి నిఘా చీఫ్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయపాల్, G.G.H అప్పటి సూపరింటెండెంట్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు.
"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR