Mulapadu Butterfly Park : ప్రకృతి అందాలకు నెలవైన మూలపాడు బటర్ ఫ్లై పార్కు పూర్వవైభవం సంతరించుకోనుంది. ఇప్పటికే చుట్టూ పచ్చటి అందాలు, కొండకోనలు, ప్రశాంతతకు తోడు సీతాకోక చిలుకల అందాలు కనువిందు చేస్తున్నాయి. నూతన సంవత్సరంలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. వనం పునఃప్రారంభించేనాటికి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అటవీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
విజయవాడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలపాడు అటవీ ప్రాంతంలో 2018లో అప్పటి కలెక్టర్ బాబు ప్రత్యేక ఆసక్తి చూపించి ఆహ్లాదకరమైన సీతాకోక చిలుకల వనాన్ని ఏర్పాటు చేశారు. రంగురంగుల మేని ఛాయతో అందంగా ఎగిరివచ్చే సీతాకోక చిలుకలు సందర్శకుల మదిని దోచుకొనేవి. అటవీ ప్రాంతంలో చుట్టూ పూలతోటల నడుమ సీతాకోక చిలుకలు చేసే సందడిని ఎవరైనా ఇట్టే కట్టిపడేసిది. కానీ పార్కు నిర్వహణను వైస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా కళతప్పింది.
Forest Dept on Mulapadu Park : కూటమి ప్రభుత్వం రాకతో అటవీశాఖ అధికారులు తిరిగి బటర్ ఫ్లై పార్కు నిర్వహణపై దృష్టి సారించారు. విశాఖపట్నంలో ఉన్న పార్కులు ఏ విధంగా అలరిస్తాయో అలానే ఇక్కడి వనాలూ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మొక్కలు చిన్నారులు ఆడుకొనేందుకు వీలుగా పరికరాలు, ప్రకృతి ప్రేమికులను అలరించేలా వెదురు కర్రలతో చేసిన బల్లలను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ను నిరోధించేందుకు వస్తువులను వినియోగించే పర్యాటకుల నుంచి డిపాజిట్ సేకరించే ఆలోచనను అధికారులు చేస్తున్నారు.
పార్కులోకి వెళ్లే ముఖద్వారాలను అటవీశాఖ ఆకర్షణీయంగా ఏర్పాటు చేసింది. లోపలకి ప్రవేశించగానే సీతాకోక చిలుకలు ఏ విధంగా ఏర్పడతాయో, వాటి మనుగడ ఏ విధంగా ఉంటుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు. పర్యాటకుల దాహం తీర్చేందుకు వనధార ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మూలపాడులో త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్న సీతాకోక చిలుకల వనాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. అటవీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని స్థానికులు చెబుతున్నారు.
"సీతాకోక చిలుకల కోసం పార్కు చాలా బాగా నిర్మించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన ప్రాంతం. అటవీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయి. సీతాకోక చిలుకల వనాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు." - మలిశెట్టి రామకృష్ణ, సందర్శకుడు