Foreign Parcel Service Center: గతంలో తపాలా శాఖ ద్వారా విదేశాలకు సరకులు పంపేటప్పుడు చెన్నైలో కస్టమ్స్ క్లియరెన్స్ ఉండేది. ప్రస్తుతం ఆ వ్యయ ప్రయాసలు లేకుండా తక్కువ ధరకే వివిధ దేశాలకు సైతం సరకులను విజయవాడ నుంచే పంపించుకోవచ్చు. విదేశాలకు పంపించే సరకులను ఈ కార్యాలయంలోనే కస్టమ్ అధికారులు తనిఖీ చేసి విదేశాలకు పంపిస్తున్నారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా విజయవాడకు సమీపంలోని గొల్లపూడి విదేశీ తపాలా శాఖ కార్యాలయం ద్వారా సరకులు ప్రపంచదేశాలకు పంపవచ్చు. విజయవాడ నగరంలోని ప్రజలకైతే ఇంటి వద్దకి వచ్చి తపాలా శాఖ సిబ్బందే విదేశాలకు పంపించే సరకులు తీసుకెళ్తారు. మిగతా పార్శిల్ ఏజెన్సీ వాళ్లతో పోలిస్తే తక్కువ ధరకు ఎంతో భద్రంగా గమ్యస్థానానికి కస్టమర్ల సరకులు చేరుస్తామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలూ ఎంతో నమ్మకంతో తమ వద్దకు వస్తున్నారని పోస్టల్ అధికారులు చెబుతున్నారు.
నేరుగా ఇంటికే అయోధ్య 'హనుమాన్' ప్రసాదం- మనీ ఆర్డర్ చేస్తే చాలు!
2013లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కస్టమ్స్ విభాగాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. దీంతో చెన్నైలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు లేకుండా విజయవాడలోనే తనిఖీలు పూర్తి చేసుకుని నేరుగా చెన్నై వెళ్తున్నాయి. గతంలో విజయవాడ నగరంలో ఓ తాత్కాలిక భవనంలో ఈ కార్యాలయం నడిచేది. ప్రస్తుతం విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలో శాశ్వత భవనం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి కస్టమర్లకు సేవలు అందిస్తుంది.
విదేశాలకు పంపించే పార్శిల్స్‌లో ఏదైనా నిషేధ పదార్థం గానీ సరకులు, వస్తువులు ఉంటే వాటికి సంబంధించిన వారికి సమాచారం ఇచ్చి ఆ వస్తువులను ఇక్కడి సిబ్బంది తిరిగి వాళ్లకు అందిస్తున్నారు. మొక్కలు, విత్తనాలు, కమర్షియల్, వస్తువులు, ఔషధాలు, కుటుంబ నియంత్రణ వస్తువులు, మానవ శరీర అవయవాలు, రక్తం, గంధపు చెక్కలు, కరెన్సీ నోట్లు వంటివి విదేశాలకు పంపించేందుకు నిషేధం ఉంటుంది. వీటిలో కొన్నింటికి ఆయా విభాగాల డైరెక్టరేట్ల నుంచి అనుమతులు తీసుకొస్తే కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్‌తో పార్సెళ్లను బట్వాడా చేస్తారు.
ఎవరైనా విదేశాల్లో ఉండే తమ వాళ్లకు అవసరమైన సరుకులను పంపించాలనుకుంటే విదేశీ తపాల శాఖ కల్పిస్తున్న ఈ పార్సెల్ సౌకర్యం వినియోగించుకోవాలని ఇక్కడి అధికారులు కోరుతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన సేవలను తపాలా శాఖ కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.