Food Distribution Through Drones : విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పంపిణీ సత్ఫలితాలనిస్తోంది. వరద సహాయ చర్యలపై విభాగాల వారీగా అధికారులకు మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు అప్పగించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతను ఏ మేరకు పూర్తి చేశారన్న విషయమై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద బాధితుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు.
విజయవాడ నగరంలో నీటమునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు జారవేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆహారాన్ని రప్పించి బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి వీరపాండ్యన్ కు అప్పగించారు. పొరుగు జిల్లాలైన బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను పంపించాలని టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా మెడికల్ టీమ్ లు ఏర్పాటుచేయాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఈ డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఓ మినీ హెలికాప్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువును మోయగలవు? ఏయే ప్రదేశాల వరకు వెళ్లగలవు? మార్గంలో ఎక్కడైనా చెట్లు, స్తంభాలు వంటివి వస్తే ఎలా తప్పించుకొని వెళ్లి రాగలవు? తదితర అంశాలను పరిశీలించారు.
CM Chandrababu Instructions To Officers : ఈ ట్రయల్ రన్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, తాగునీరు, మెడిసిన్ వంటివి దీని ద్వారా తీసుకెళ్లొచ్చని అంచనాకు వచ్చారు. అయితే, వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో చూసుకొని వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌కు మూడు ఫుడ్‌డెలివరీ డ్రోన్లను వినియోగించగా. మరో ఐదు డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.
సహాయక చర్యలు ముమ్మరం- వరద బాధితులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ - Flood relief operations in ap
మరోవైపు వరద సహాయ చర్యల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. విజయవాడ నగరంలో నిరాశ్రయుల కోసం 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులకు మంచినీరు, ఆహారం పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సీఎం సూచనలు ఇస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో చిక్కుకున్న వరద బాధితులకు స్థానిక టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందించాయి. ఇళ్లల్లో ఉన్న బాధితుల వద్దకు పడవలో వెళ్లి స్థానిక వారికి ఆహారం పంపిణీ చేశారు. పడవలోనే ఆహారాన్ని పెట్టుకొని ఇల్లులు తిరుగుతూ విస్తరాకులలో వడ్డించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశం మేరకు స్థానిక పార్టీ నేతలు వరద బాధితులకు అండగా నిలిచారు. తాడేపల్లి చిన్నజీయర్ ఆశ్రమం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి బాధితులకు ఆహారాన్ని అందించారు. మరోవైపు తుళ్లూరు మండలం పెదలంకలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకి చేర్చారు.