Checking at MP MVV Satyanarayana House: విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ నివాసంలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు.
విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈ తనిఖీలు జరిగాయి. దీనినే ఆయన కార్యాలయంగా కూడా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటలు దాటిన తరువాత ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రెండు అక్కడకు చేరుకుని సోదాలు ప్రారంభించాయి.
ఆ సమయంలో ఎంపీ ఎంవీవీ ఇంట్లో లేరు. ఎంపీ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి ఆడిటర్ జీవీ ఉన్నారని సమాచారం. ఈ బృందాలు తనిఖీల కోసం వచ్చాయన్న సమాచారంతో హుటాహుటిన నివాసానికి చేరుకున్న ఎంవీవీ చేరుకున్నారు. రాత్రి 9.30 సమయంలో ఎంవీవీ వెంట మరో రెండు బృందాలు కూడా సోదాల కోసం కార్యాలయంలోకి ప్రవేశించాయి.
విశాఖ తూర్పులో వైసీపీ ఎంపీ తాయిలాలు - ఓటున్న మహిళలకు చీర
రాత్రి 10.30 తర్వాత ఎలక్షన్ అధికారులూ వెళ్లారు. ఈ సమయంలో మీడియాను, పార్టీ కార్యకర్తలను ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు. పార్టీ ఆఫీస్ గేట్లు మూసేశారు. కాగా గత కొన్ని రోజులుగా ఎంవీవీ వివిధ వార్డుల్లో సమావేశాలు పెడుతూ, అక్కడ వారికి తాయిలాలు ఇచ్చేందుకు టోకెన్లను పంచుతున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలోనే భారీ మొత్తంలో ముద్రించిన టోకెన్లు ఇతర సామగ్రి నివాసం కార్యాలయంలో ఉన్నాయన్న దాన్ని ఖరారు చేసుకునేందుకే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల నాలుగు బృందాలు ఒకేసారి ఈ తనిఖీలకు వచ్చాయని సమాచారం. రాత్రి దాదాపు రెండు గంటల సమయంలో రెండు బృందాలు వెనక్కి వెళ్లి పోయాయి. మరో రెండు బృందాలు మాత్రం తమ సోదాను కొనసాగించాయి. అయితే తనిఖీలలో ఏమి లభ్యమయ్యాయి అనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
ఓటర్లకు చీరలు - తీసుకోకపోతే పథకాలు కట్ - విశాఖలో ఎంపీ హుకుం!
గతంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన గ్రీన్ గార్డెన్ అపార్ట్మెంట్లో ఎన్నికల పరిశీలన బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో క్రికెట్ కిట్లు, డ్రెస్ మెటీరియల్స్ నగదు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే వచ్చిన మొదటి ఫిర్యాదు కావడంతో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో మొత్తం 65 ప్లాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల తనిఖీ బృందాలకు ఎటువంటి వస్తువులు దొరకలేదని పేర్కొన్నారు.
బొట్టు పెట్టి, చీర ఇచ్చి ఓటు వేయాలని వైసీపీ నేతల అభ్యర్థన- తాయిలాలను అడ్డుకునే అధికారులు ఎక్కడ?