Flowers Prices Increased in AP: శ్రావణమాసం కోసం అతివలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ మాసంలోని వరలక్ష్మీ వ్రతానికి తెలుగు లోగిళ్లు శోభాయమానంగా ముస్తాబు చేశారు. శ్రావణమాసం రెండో శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మీ రూపంలో అలంకరించి వ్రతం నోచుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని మహిళల నమ్మకం. ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్దలతో వరలక్ష్మీ పూజ నిర్వహిస్తే కొరిన వరాలు సైతం సిద్ధిస్తాయని మహిళల విశ్వాసం. అయితే డిమాండ్ అనుగుణంగా పూలు, పండ్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటిని, పూజా మందిరాన్ని వివిధ రకాల పూలు, మావిడాకులతో అందంగా అలంకరిస్తారు. ఇందుకోసం అవసరమైన పూజా సామాగ్రి, పూలు కొనుగోలు చేసేవారితో మార్కెట్లో కిక్కిరిసిపోయాయి. వివిధ రకాల పూలు పండ్లతోపాటు, కొబ్బరికాయలు, మావిడాకులు ఇతర పూజా సామాగ్రి కొనుగోలు కోసం వచ్చిన వారితో రాష్ట్రంలోని పలు హోల్ సేల్ పూల మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది.
అదే విధంగా వరలక్ష్మీ వ్రతం రోజు ముత్తైదువులకు వాయినాల్లో రకరకాల పండ్లు ఇస్తారు. ఫలితంగా, పూలు, పండ్ల మార్కెట్లు ముందురోజే కిటకిటలాడాయి. ఐతే పూలు, పండ్ల ధరలు చూసి కొనుగోలుదారుల మొహాలు వాడిపోయినంత పనైంది. బంతి పూలు కిలో వంద, చామంతి, గులాబీలు 4 వందలు, జాజిపూలు 15 వందలకు పైనే ధర పలింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ధరలు విపరీతంగా పెరిగిపోయాయని కొనుగోలుదారులు చెబుతున్నారు.
మీ ఇష్ట దైవానికి ఈ పూలు సమర్పించొద్దట! - మీకు తెలుసా? - Never Offer These Flowers to Gods
విజయవాడ హోల్ సేల్ పూల మార్కెట్‌కు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పూలు దిగుమతి అవుతుంటాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఒక్క రోజే 60 టన్నుల బంతి, 30టన్నుల చామంతి పూలతోపాటు పెద్ద మెుత్తంలో మల్లెపూలు, గులాబీ, జాజిపూలు దిగుమతి అయ్యాయి. అదే విధంగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం పూల మార్కెట్ కళకళలాడుతోంది. ఆనందపురం పూల మార్కెట్‌కు దేశవాళీ హైబ్రిడ్కు చెందిన వివిధ రకాల పూలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి.
మహారాష్ట్ర, రాజస్థాన్, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి హైబ్రిడ్ బంతి, చామంతి, గులాబి తదితర పువ్వులు రవాణా చేసుకుంటున్నామని విక్రయదారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా రవాణా ఖర్చులు ఎక్కువ అవ్వడంతో గిట్టుబాటు ధర లేకపోవడంతోనే ధరల పెరుగుతున్నాయన్నారు. మరోవైపు శ్రావణ మాసానికితోడు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో పూలకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. కొద్దిరోజుల్లో మళ్లీ ధరలు సాధారణ స్థితికి వస్తాయని చెబుతున్నారు.
"మార్కెట్లో పువ్వుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతం చాలా మంది చేసుకుంటారు కాబట్టి ధరలు విపరీతంగా ఉన్నాయి. గతంలో 40, 50 ఉండేవి ఇప్పుడు 100 వరకూ చెప్తున్నారు. ఎంత ధరలు ఉన్నా తీసుకోవాల్సిందే కదా. శ్రావణమాసం కాబట్టి ఈ నెల మొత్తం ఇలాగే ఉంటాయి ఏమో". - కొనుగోలుదారులు
మహాశివరాత్రి నాడు శివుడిని ఈ పూలతో పూజిస్తే - అష్టైశ్వర్యాలు కలుగుతాయట!