Floods Increasing to Vijayawada Singh Nagar : విజయవాడలో వరద ముంపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. కొన్ని చోట్ల నీరున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడిందని అనుకునేలోపు సింగ్ నగర్ ప్రాంతంలో క్రమంగా వరద పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి బుడమేరుకి వరద వచ్చి చేరుతోంది. దీంతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షపు నీరు బుడమేరుకు చేరుతోంది. వరద పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు వరద తగ్గడంతో ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారంతా సింగ్ నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం వరద పెరగడంతో తిరిగి ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
అయితే ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. రేషన్ పంపిణీ వాహనాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తోంది. దీంతో పాటు ముంపులో ఉన్న ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లు వంటివి అందజేస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మున్సిపల్ కార్మికులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. వందకుపైగా ఫైరింజన్లతో ఇళ్లు, వీధులు శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతుండగా వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వేగంగా తొలిగిస్తున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేయడానికి వరద పెరుగుదల ఆటంకంగా మారింది. అలాగే వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ లిక్విడ్‌ని వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లారు. గడిచిన ఐదు రోజులుగా చీకట్లో మగ్గిన విజయవాడలో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ శాఖ కరెంటు పునరుద్ధరించింది.
విజయవాడలో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్కన పార్కు చేసిన కార్లు సైతం వరద ఉద్ధృతికి తలకిందులయ్యాయి. వరదతగ్గడంతో దెబ్బతిన్నకార్లను అతికష్టంమీద షోరూమ్‌లకు తరలించిన యజమానులు వాటికి మరమ్మతు చేయించేందుకు తంటాలు పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేల నుంచి లక్షల రూపాయలకు మించే ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షో రూమ్ 4 రోజులు నీటిలోనే నానిపోయింది. శివారుల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు, షోరూమ్‌ల్లోకి నీరు చేరింది. వాహనాలకు బీమా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వారు ఒకింత ఆశలు పెంచుకున్నారు.