Prakasam Barrage Flood Increasing : తుపాను ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13 అడుగులకు నీటిమట్టం చేరింది. మొత్తం 70 గేట్ల ద్వారా 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇప్పుడిప్పుడే విజయవాడను ముంపు వీడుతున్న నేపథ్యంలో కృష్ణమ్మకు పేరుగుతున్న వరద ప్రవాహం నగర వాసుల్లో ఆందోళనను కలిగిస్తోంది.
ప్రకాశం బ్యారేజ్ గేట్లు పరిశీలించిన సీఎం: మరోవైపు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడుతో చంద్రబాబు మాట్లాడారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. కృష్ణానది ప్రవాహం గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
కౌంటర్ వెయిట్ల నిర్మాణంలో కృషి చేసిన వారిని సీఎం అభినందించారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుందని సీఎంకు ఇంజినీర్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ పటిష్టతకు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారనినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు. డ్యామ్‌కు, గేట్లకు ప్రమాదం జరగకుండా బోట్లు తీయాలని కన్నయ్యనాయుడు చెప్పారు.
దంచికొడుతున్న వర్షాలు: మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పొంగిన వాగులు, గెడ్డలు రోడ్లు, పొలాలను ముంచెత్తాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాన తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం ఉంటేనే ఇళ్లనుంచి బయటికి రావాలని సూచించారు. ఒడిశా-బంగాల్ మధ్య తుపాను తీరం దాటేవరకు వర్షాల జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
Cyclone Control Rooms: తుపాను నేపథ్యంలో పలు జిల్లాలో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్, పోలీసు, తహసీల్దార్ కార్యాలయాల్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు, అత్యవసరం అయితే సంప్రదించాల్సిన ఫోనే నెంబర్లను ఇచ్చారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 0891-2590102, 0891-2590100, పోలీసు కంట్రోల్ రూమ్ 0891-2565454 తో పాటు 100, 112కి చేయవచ్చని సూచించారు.
వీటితో పాటు విశాఖ జిల్లా పెదగంట్యాడ తహసీల్దార్ 9948821997, గాజువాక 8886471113, ఆనందపురం 9700501860, భీమిలి 9703888838, పద్మనాభం 7569340226, చినగదిలి 9703124082, పెందుర్తి 7702577311, సీతమ్మధార 9182807140, గోపాలపట్నం 7842717183, ములగాడ తహసీల్దార్ 9440552007 నెంబర్లను ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra